రేషన్‌.. కేరాఫ్‌ కరప్షన్‌!

corruption in ration shop goods supply - Sakshi

పేదల చక్కెర స్వాహా

50 శాతం కార్డులకు ఎగనామం

బియ్యం తూకాల్లో మోసాలు

డీలర్ల అక్రమాలపై దృష్టి సారించని అధికారులు

కర్నూలు(అగ్రికల్చర్‌)/ కల్లూరు రూరల్‌: పేదలకు తక్కువ ధరకు సరకులు అందించే రేషన్‌ దుకాణాలు అవినీతి, అక్రమాలకు మారుపేరుగా మారాయి. యాభై శాతం కార్డుదారులకు చక్కెర ఇవ్వకుండా బయటి మార్కెట్‌లో అమ్ముకుని డీలర్లు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ–పాస్‌ మిషన్‌లో బియ్యం, చక్కెరకు ఒకేసారి వేలిముద్ర వేయించుకొని బియ్యం మాత్రం ఇస్తూ చక్కెరను నొక్కేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. గట్టిగా అడిగిన వారికి మాత్రమే చక్కెర ఇస్తున్నట్లు డీలర్స్‌ అసోసియేషన్‌కు చెందిన ఓ నాయకుడే ఒప్పుకోవడం గమనార్హం. బియ్యం పంపిణీలో కూడా తక్కువ తూకాలు వేస్తూ కార్డుదారుల నోళ్లలో మట్టి కొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. 

పునఃపంపిణీ నుంచి..  
ఏడాది క్రితం రేషన్‌కార్డులకు చక్కెర పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జనవరి నుంచి అన్ని కార్డులకు అరకిలో ప్రకారం పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలో 11,82,111 రేషన్‌కార్డులకు సంబంధించి 2,242 చౌక దుకాణాలున్నాయి. ఇందులో అంత్యోదయ అన్న యోజన కార్డులు 60వేల వరకున్నాయి. తెల్లకార్డులకు డిసెంబరు వరకు చక్కెర బంద్‌ చేసినప్పటికీ అంత్యోదయ కార్డులకు కిలో ప్రకారం ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జనవరి నుంచి తెల్ల కార్డులకు అర కిలో ప్రకారం ఇస్తున్నా రు. ఫిబ్రవరికి సంబంధించి అన్ని చౌకదుకాణాల డీలర్లు డీడీలు చెల్లించి చక్కెర లిఫ్ట్‌ చేసినట్లు స్పష్టమవుతోంది. 

గట్టిగా అడిగితేనే చక్కెర..  
ఫిబ్రవరికి సంబంధించి బుధవారం సాయంత్రం వరకు 9,87,385 కార్డులకు సరుకులు పంపిణీ చేశారు.  అంత్యోదయ కార్డులకు కిలో రూ.13.50, తెల్లకార్డులకు అరకిలో రూ.10 ప్రకారం చక్కెర పంపిణీ చేయాల్సి ఉంది. అయితే 50 శాతం కార్డులకు చక్కెర ఇచ్చిన దాఖలాలు లేవు. అడిగిన వారికి ఇస్తున్నామని డీలర్లే చెబుతుండడాన్ని బట్టి అక్రమాలు ఏస్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. జిల్లా యంత్రాంగం మొత్తం కొలువైన కర్నూలులోనే పలువురు డీలర్లు చక్కెర ఇవ్వకపోవడం గమనార్హం. ఇలా మిగుల్చుకున్న చక్కెరను కిలో రూ.30 నుంచి రూ.35 ప్రకారం బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.  

రసీదులు ఇవ్వరు..
ఈ–పాస్‌ మిషన్‌లో వేలిముద్ర వేయించుకొని బియ్యంతో పాటు చక్కెర కూడా ఇవ్వాల్సి ఉంది. పంపిణీ చేసిన సరుకులు, వాటి ధర వివరాలతో కార్డుదారులకు రసీదులు ఇవ్వాలి. అయితే తమ అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశ్యంతో డీలర్లు ఎక్కడా రసీదులు ఇవ్వడం లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top