
రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో పేరుకుపోయిన 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యం
సన్న బియ్యానికి తప్పని లక్క పురుగుల బెడద
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి తెల్లరేషన్‌కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి నెలలో మిగిలిపోయిన దొడ్డుబియ్యం ఇంకా రేషన్ షాప్‌లలోనే ఉంది. మూడు నెలలుగా స్టాక్ ఉండటంతో ముక్కిపోతున్నాయి. పైగా లక్క పురుగులు వచ్చి చేరుతున్నాయి. దీంతో దొడ్డు బియ్యానికి పట్టిన లక్క పురుగులు సన్న బియ్యానికి పడతాయని రేషన్ డీలర్లు అంటున్నారు.
మార్చి నెలలో కార్డుదారులకు ఇవ్వగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో 28,380.97 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం మిగిలింది. వాటిని రేషన్‌షాప్‌లలో పక్కన పెట్టాలని పౌరసరఫరాల శాఖ గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గదులు ఇరుకుగా ఉండటంతో సన్న బియ్యం దించుకునేందుకు స్థలం ఉండటం లేదు. ఈ బియ్యమంతా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీవరకు రేషన్‌షాప్‌లకు చేరింది. మూడు నెలలుగా నిల్వలు ఉండటంతో లక్క పురుగు పడుతున్నాయి. పలుచోట్ల వర్షాలకు తడిసి ముక్కిపోతున్నాయి.
ఎఫ్‌సీఐకి పెడితే ఆదాయం
సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో దొడ్డు బియ్యంతో పని ఉండదు. ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐ లేదా ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పైగా రేషన్‌షాప్‌లలో ఉన్న సన్న బియ్యానికి లక్క పురుగుల బాధ ఉండదు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే షిఫ్ట్ చేస్తాం
రేషన్ షాప్‌లలో స్టాక్ ఉన్న దొడ్డు బియ్యం గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆ బియ్యం బస్తాలకు రెడ్ కలర్‌తో ఇంటు మార్క్ వేయించాం. ఈ బియ్యాన్ని శుభ్రంగా ఉంచాలని, సేఫ్టీగా భద్రపరచాలని డీలర్లకు చెప్పాం. బియ్యం తరలింపుపై ఆదేశాలు రాగానే రేషన్‌షాపుల నుంచి తరలిస్తాం. – అబ్దుల్ హమీద్, అదనపు కలెక్టర్, సిద్దిపేట