వేదన తీరె.. బోధన మారె!

Contract Lecturers Regularization In AP - Sakshi

పాదయాత్రలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే అమలుచేసిన వైఎస్‌ జగన్‌

 శ్రీకాకుళం న్యూకాలనీ: కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు తీపి కబురును అందించింది. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశంలోనే కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌ లెక్చరర్ల అర్హతలు, సీనియారిటీ ప్రాతిపదికన క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో జగన్‌ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కాంట్రాక్ట్‌ లెక్చరర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాల తమ చిరకా ల న్యాయపరమైన డిమాండ్‌ నెరవేరిందని పట్టరాని ఆనందంతో ఉన్నారు. బుధవారం రాష్ట్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా కళాశాలలు తెరుచుకున్న సమయంలో ఆ నోటా ఈ నోటా ఇదే చర్చ. దశాబ్దాల డిమాండ్‌ను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన పదిరోజుల్లోనే మోక్షం కలకడంతో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు సంతోషంతో మునిగితేలుతున్నారు. సీఎం జగన్‌ చారిత్రక నిర్ణయం తీసుకోవడంపై వారంతా నూతనోత్సాహంతో పనిచేస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇది..
రాష్ట్రవ్యాప్తంగా 450 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 3800 మంది వరకు కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 44 ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలు ఉండగా దాదాపు 388 మంది వరకు కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఉన్నారు. 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న మరో 80 మంది వరకు ఉన్నారు. వీరిలో సుమారు 20శాతం మంది రెండు దశాబ్దాల నుంచి కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తుండగా, మరో 50 శాతం మంది దశాబ్దానికి పైగా ప్రభుత్వ కళాశాలల్లో పాఠాలు బోధిస్తున్నారు. 1999లో కాంట్రాక్ట్‌ లెక్చరర్ల వ్యవస్థను నాటి చంద్రబాబు తీసుకొచ్చారు. ఒక లెక్చరర్‌కు ఇచ్చే జీతంతో నలుగురుగు కాంట్రాక్ట్‌ లెక్చరర్లతో పాఠాలు బోధించవచ్చని దుర్మార్గపు ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకొచ్చారని విద్యావేత్తలు ఇప్పటికీ చెబుతూ ఉంటారు.

మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అతని ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, లెక్చరర్లపై పూర్తిగా శీత కన్నేసింది. తమకు జీతాలు పెంచాల ని, సమాన పనికి సమాన వేతనం మంజూరుచేయాలని, క్రమబద్ధీకరణ జరపాలని వివిధ రూపాల్లో ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు, వంటా వార్పు చేపట్టారు. ఎంత చేసినా ఏంచేసినా కాంట్రాక్ట్‌ లెక్చరర్లను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. పొరుగునే ఉన్న తెలంగాణా రాష్ట్రంలో బేసిక్‌ (రూ.38,000) వేతనాన్ని జీతంగా చెల్లిస్తుండగా రాష్ట్రంలో మాత్రం కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు నెలకు రూ.27వేల జీతాన్నే చెల్లిస్తున్నారు. డిగ్రీ లెక్చరర్లకు 30వేలు వరకు లభిస్తుంది.

నేను ఉన్నానంటూ.. పాదయాత్రలో జగన్‌ హామీ
ప్రజాసంకల్పయాత్ర పేరిట రాష్ట్రంలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర సమయంలో అన్నిశాఖల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరిల ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్‌ లెక్చరర్ల దీనగా థను తెలుసుకున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంఘాలు నేరుగా జగన్‌ దృష్టికి తమ న్యాయపరమైన డిమాండ్ల ను తీసుకెళ్లాయి. మీ సమస్యను నేను విన్నాను .. నేను ఉన్నానంటూ ఆనాడే భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తానని కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంఘ నాయకుల కు జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చా రు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పది రోజుల్లోనే జరిగిన మొదటి కేబినేట్‌ సమావేశంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు శుభం కార్డు పడేలా నిర్ణయం తీసుకోవడంపై సర్వాత్రా హర్షం వ్యక్తమవుతోంది. తమతో పాటు తమ కుటుంబాల్లో వెలుగులు నింపుతు న్న జగన్‌మోహన్‌రెడ్డిని రుణం తీర్చుకోలేమని వారంతా చెబుతున్నారు.

గెస్ట్‌ లెక్చరర్లకు న్యాయం 
ఇదే సమయంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లకు, పార్ట్‌టైం లెక్చరర్లకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాంట్రాక్ట్‌ లెక్చరర్ల స్థానంలో ఆరేళ్ల కిందట సత్సమాన విద్యార్హతలతో కూడిన గెస్ట్‌ లెక్చరర్లు నియామకాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలల్లో పాఠాలు బోధిస్తున్నారు. వీరికి ప్రస్తుతం పీరియడ్‌కు రూ.150 చెల్లిస్తూ నెలకు గరిష్టంగా రూ.10 వేలు అందజేస్తున్నారు. పార్ట్‌టైమ్‌ లెక్చరర్లకు గత ఏడాది దీన్ని పీరియడ్‌కు రూ.375 చెల్లిస్తూ నెలకు రూ.27 వేలు చెల్లిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేసి మీకు న్యాయం చేస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చినట్లు గెస్ట్‌ లెక్చరర్ల సంఘం నాయకులు చెబుతున్నారు. కాంట్రా క్ట్‌ లెక్చరర్ల మాదిరి తమకు కూడా జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు న్యాయం చేస్తుందని వారంతా ఆశగా ఎదురుచేస్తున్నారు.

మా జీవితాల్లో వెలుగులు..
దశాబ్దాల నుంచి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు పాఠాలు బోధిస్తున్నారు. రెగ్యులర్‌ లెక్చరర్‌తో సరిసమానంగా విధులు నిర్వర్తిస్తు కళాశాలల అభివృద్ధికి, విద్యార్థుల ఎదుగుదల, మెరుగైన  ఫలితాలకు కారణం అవుతున్నారు. మమ్మల్ని క్రమబద్ధీకరించాలని దశాబ్దం నుంచి డిమాండ్‌ చేస్తూనే ఉన్నాం. సీఎం జగన్‌ పుణ్యమా అని మా జీవితాల్లో వెలుగులు రానున్నాయి. 
– బొడ్డు ప్రవీణ్‌కుమార్, మ్యాథ్స్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్, జీజేసీ మందస

రెండు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు 
దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లు రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ ఉన్నారు. వారంతా ఆఖరి దశలో ఉన్నారు. దశాబ్దాలుగా ఎన్నో విధాలుగా పోరాటాలు, ధర్నాలు చేశాం. ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో మీ సమస్య నేను విన్నాను.. మీకు నేను ఉన్నాను అంటూ అభయం ఇచ్చారు. ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లోనే మొదటి కేబినేట్‌ భేటీలో క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషం.
– కరణం రవీంద్రనాధ్‌ ఠాగూర్, కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి, జీజేసీ బూర్జ

అందరికీ న్యాయం చేయాలి..        
కాంట్రాక్ట్‌ లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మేము ముందునుంచి నమ్ముతున్నాం. ఆయన్ని గెలిపించుకున్నాం. ఆయన ఇచ్చిన మాటకోసం ఎందాకైనా వెళ్తారని అంతా అంటుంటారు. అది మరోసారి రుజువైంది. క్రమబద్ధీకరణకు సర్వీసు, విద్యార్హత తీసుకోవడం మంచిదే. అయితే సాధ్యమైనంత వరకు అందరికీ న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్‌ చొరవ తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. 
– హనుమంతు రామ్మోహన్‌దొర(బుజ్జి), కాంట్రాక్ట్‌ లెక్చకరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top