టార్చ్‌లైట్‌ ఆపరేషన్లు పునరావృతం కారాదు

CM YS Jagan Directions to Health Department At the Collectors Conference - Sakshi

కలెక్టర్ల సదస్సులో ఆరోగ్యశాఖకు ముఖ్యమంత్రి జగన్‌ దిశా నిర్దేశం

ఎలుకలు కొరికి శిశువులు మృతి చెందిన ఘటనలు మళ్లీ జరగకూడదు

సాక్షి, అమరావతి: టార్చ్‌లైట్లు, సెల్‌ఫోన్ల వెలుతురులో పేద రోగులకు ఆపరేషన్లు నిర్వహించే పరిస్థితులు మళ్లీ రాకూడదని, ఎలుకలు కొరికి శిశువులు మృతి చెందిన ఘటనలు పునరావృతం కారాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడంపై దిశా నిర్దేశం చేశారు. 

తక్షణమే ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల
గత 9 నెలలుగా పేరుకుపోయిన సుమారు రూ.450 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద మెరుగైన సేవలు అందించాలన్నారు. హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీల వద్ద ఉండే నిధులను కలెక్టర్లు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సొసైటీల అధ్యక్షులుగా ఎమ్మెల్యేలను నియమిస్తున్నట్లు జీవో జారీ అయిందా? అని ఆరా తీశారు. దీనిపై కొందరు ప్రతికూలంగా మాట్లాడుతున్నా బాధ్యతలు పెరిగి మంచే జరుగుతుందన్నారు.

మాతా శిశుమరణాలు తగ్గాలి..
మాతాశిశు మరణాలు గణనీయంగా  తగ్గేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. వర్షాల నేపథ్యంలో జ్వరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు.

త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు: జవహర్‌రెడ్డి
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నవారందరికీ త్వరలోనే కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డా.కె.జవహర్‌రెడ్డి తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఆయన వైద్య ఆరోగ్యశాఖపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న రూ.750 కోట్లతో సివిల్‌ నిర్మాణాలు చేపడతామన్నారు. భారతీయ వైద్యమండలి నిబంధనల మేరకు వైద్య కళాశాలల్లో వసతులు కల్పిస్తామని చెప్పారు. శిశుమరణాలను గణనీయంగా నియంత్రించి ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఆరోగ్యశాఖను తీర్చిదిద్దుతామన్నారు. క్యాన్సర్‌ కేర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. మలేరియా, డెంగీ జ్వరాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. కంటి జబ్బులు, అసాంక్రమిక (ఎన్‌సీడీ) జబ్బుల నియంత్రణకు పక్కా వ్యూహంతో ముందుకెళతామన్నారు. ఆరోగ్యశాఖలో సంస్కరణల కోసం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

కలెక్టర్లు ఏమన్నారంటే...
- ఏజెన్సీ ప్రాంతాల్లో 108 అంబులెన్సులు సరిపోవడం లేదు. వీటిని పెంచాలి. పాత వాహనాలను మార్చాలి.
ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాల పనితీరు బాగా లేదు. వీటిని సరిదిద్దాలి.
పీహెచ్‌సీల నుంచి సీహెచ్‌సీలుగా ఉన్నతీకరించిన ఆస్పత్రులకు సిబ్బందిని సమకూర్చాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top