వరదలు తగ్గగానే.. భారీగా ఇసుక

CM YS Jagan Comments on Sand with Collectors and SPs at Video Conference - Sakshi

ఇసుక వారోత్సవం పేరుతో వచ్చే వారం నుంచి ఇసుక మీదే పని చేద్దాం

‘స్పందన’పై వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్‌ జగన్‌

267 రీచ్‌లుంటే వరద వల్ల 60 చోట్లకు మించి ఇసుక తీయలేకపోతున్నాం

ఇసుక కొరత గురించి ఎవరూ మాట్లాడకుండా అందుబాటులోకి తెద్దాం

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదు.. నిఘా పెంచండి

డీజీపీ స్వయంగా పర్యవేక్షించాలి

గతంలో ఇసుక దోచేసిన వారే ఇప్పుడు మాట్లాడటం విడ్డూరం

టీడీపీ దుష్ప్రచారాన్ని ఖండించండి.. మన పారదర్శక పనులను వివరించండి

అవినీతిని దూరం చేయడంతో రాబందుల మాదిరిగా మనపై రాళ్లు వేస్తున్నారు. టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తోంది. దుష్ప్రచారాలను వెంటనే ఖండించాలి. గతంలో ఎప్పుడూలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి.. వరదలు వస్తున్నాయి.. ఇలా వర్షాలు రావడం రైతులకు, అందరికీ మంచిదే. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదే.  – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వరదల కారణంగా 90 రోజులుగా ఇసుకను ఆశించినంత రీతిలో తీయలేకపోతున్నామని, వచ్చే వారమంతా దాని మీదే పని చేసి కొరత లేకుండా చేద్దామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని భావిస్తున్నామని, ఆ తర్వాత ‘ఇసుక వారోత్సవం’ చేపట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. గతంలో ఇసుకను దోచేసిన వారే ఇప్పుడు దుష్ప్రచారం చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సమావేశంలో ఇసుక లభ్యత, సరఫరాపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదని, ఒక్క ఇసుక లారీ కూడా రాష్ట్రం నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహరా ఉంచాలని, డీజీపీ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో కుడి, ఎడమ తేడా లేకుండా రాబందుల మాదిరిగా ఇసుకను దోచేసిన వారు, ఇష్టానుసారం అవినీతికి పాల్పడిన వారు  మనపై రాళ్లు వేస్తున్నారన్నారు. గతంలో వారు వ్యవస్థను తీవ్ర అవినీతిమయం చేస్తే, ఇప్పుడు దాన్ని మనం పూర్తిగా మరమ్మతు చేస్తున్నామని చెప్పారు. ‘ఎక్కడైనా అక్రమం జరిగితే అడ్డుకోండని కలెక్టర్, ఎస్పీలకు ఎప్పుడో చెప్పాను. ఆ గ్రీన్‌ కార్డు వారికి ఉంది. అందుకే ఇవాళ ఇసుక తవ్వకాలలో అవినీతిని దూరంగా పెట్టగలిగాం అని గర్వంగా చెప్పగలుతున్నా’ అని సీఎం అన్నారు.

వాగులు, వంకల్లో 70 రీచ్‌లు గుర్తింపు
వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో ఇసుక తీసేందుకు 70 రీచ్‌లను గుర్తించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో ఎవరైనా చలానా కట్టి, 20 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్‌ ద్వారా తరలించుకోవచ్చన్నారు. పనులు కావాల్సిన వారు గ్రామ సచివాలయం ద్వారా ఇసుక రీచ్‌ల్లో పనులు చేసుకోవచ్చని, దీన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. వరద తగ్గగానే ఆ రీచ్‌లలో ఎవరు పనులు అడిగినా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రభుత్వమే ఇసుకను తవ్వుతుంది కాబట్టి.. పేదలకు మరింతగా పనులు దొరికి మంచి జరుగుతుందన్నారు. ఈ విషయాలను ప్రజలకు తెలియజేస్తూ మరో పక్క ప్రతిపక్షం కావాలనే దుష్ప్రచారం చేస్తోందనే విషయాన్నీ వివరించాలని సీఎం సూచించారు. భవన నిర్మాణ కార్మికులకు గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక తవ్వకాల్లో పనులు కల్పించాలని ఆదేశించారు.  

ముందుకొచ్చిన వారికి సరఫరా బాధ్యతలు
కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున రవాణా చార్జి నిర్ణయించామని, ఎవరైతే ముందుకు వస్తారో వారికి ఇసుక సరఫరా కూడా అప్పగిస్తామని చెప్పామని సీఎం గుర్తుచేశారు. ఇంకా ఎవరైనా ముందుకు వస్తే దరఖాస్తు తీసుకుని వారికి ఆ పని అప్పగించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇంత పారదర్శకంగా మనం చేస్తున్న వాటన్నింటి గురించి ప్రజలకు చెప్పాలని సీఎం సూచించారు. 267 రీచ్‌లు ఉంటే వరదల కారణంగా సుమారు 60 చోట్ల మించి ఇసుకను తీయలేకపోతున్నామన్నారు. రెండు రోజుల్లో నవంబర్‌ నెల వస్తోందని, కచ్చితంగా వరదలు తగ్గుతాయని.. ఆ వెంటనే కావాల్సినంతగా ఇసుకను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.  ఇంతకు ముందు అవినీతి, మాఫియాలతో ఇసుకను తరలించేవారని, ఇప్పుడు ప్రభుత్వమే తవ్వకాలు చేపట్టింది కాబట్టి, అన్ని చోట్లా యంత్రాలు కాకుండా మాన్యువల్‌గా ఆ పని చేస్తున్నందున భవన నిర్మాణ కార్మికులకు మరింతగా పనులు లభిస్తాయని చెప్పారు. దీంతో పనులు దొరకలేదన్న సమస్య తలెత్తదని స్పష్టం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top