
తెలంగాణపై బాబు ద్వంద్వ నీతి: జీవన్‌రెడ్డి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణపై ద్వంద్వ నీతితో, రెండునాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని మాజీమంత్రి టి. జీవన్‌రెడ్డి విమర్శించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణపై ద్వంద్వ నీతితో, రెండునాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని మాజీమంత్రి టి. జీవన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు అనుకూలమని ప్రకటించి ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకున్న తరుణంలో తెలుగుజాతిని చీల్చుతారా? అంటూ తన నిజస్వరూపాన్ని బయటపెట్టారని విమర్శించారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బాబు పాలనలో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరగడం వల్లే తెలంగాణప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరం ప్రత్యేక రాష్ట్రం కోసం సోనియాగాంధీకి లేఖ ఇచ్చామని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దీనికి కారణమన్న విమర్శలు కొందరు చేస్తుంటే.. మరికొందరు ఆయన్ను తెలంగాణ వ్యతిరేకిగా విమర్శిస్తున్నారన్నారు.
కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదనే ఉద్దేశంతోనే చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినట్లు కనిపిస్తోందన్నారు. నిర్ణయం వెలువడ్డాక.. తెలుగుజాతిని రెండు చేస్తారా? అని, టీడీపీని నిర్వీర్యం చేసేందుకే ఇలా చేస్తున్నారన్న ఆయన విమర్శలు తెలంగాణ వ్యతిరేకతను బయటపెడుతున్నాయన్నారు.
హైదరాబాద్‌ను తాను అభివృద్ధి చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. వాస్తవానికి బాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ చాలా నష్టపోయిందని, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని భూములను తెగనమ్మేశారని, కనీసం అక్కడి జిల్లా కార్యాలయాలకు కూడా భూముల్లేకపోవడం సిగ్గుచేటన్నారు.