బాబు హామీలు ‘మాట వరసకే’?! | Chandrababu Naidu declare of IPad scheme to farmers is ridicule | Sakshi
Sakshi News home page

బాబు హామీలు ‘మాట వరసకే’?!

Aug 1 2014 1:54 AM | Updated on Jul 30 2018 1:18 PM

ఆంధ్రప్రదేశ్ రైతులకు ఐ-ప్యాడ్‌లు ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన నవ్వులాటగా మారింది. ‘ఏదో మాట వరుసకు అన్నదాన్ని సీరియస్‌గా తీసుకుంటే ఎలా?’

నవ్వులాటగా మారిన ‘రైతులకు ఐ-ప్యాడ్’ ప్రకటన
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఐ-ప్యాడ్‌లు ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన నవ్వులాటగా మారింది. ‘ఏదో మాట వరుసకు అన్నదాన్ని  సీరియస్‌గా తీసుకుంటే ఎలా?’ అని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించడాన్ని బట్టే.. చంద్రబాబు హామీల్లో వాస్తవమెంతో తేలిపోయింది. ఐ-ప్యాడ్‌లు ఇస్తామంటూ సీఎం చేసిన ప్రకటనపై మంత్రులు, అధికారులు పెదవి విరుస్తున్నారు. సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా హామీలు ఇవ్వడం వాటిని నిలబెట్టుకోలేకపోవడం చంద్రబాబుకు సర్వసాధారణంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు వ్యవసాయంపై విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉన్నట్లు పేర్కొన్నారు.
 
  (పాస్ పుస్తకాలున్న వారే రైతులుగా చెప్తూ వారి సంఖ్య 70 లక్షలుగా తేల్చారు.) నిజంగానే ఐ-ప్యాడ్‌లు ఇవ్వాలనుకుని మళ్లీ వారి సంఖ్యను కుదించాలనుకున్నా ఇంటికి ఇద్దరిని లెక్కేసి మొత్తంగా 35 లక్షల మందే రైతులు అని తేల్చినా.. అన్ని ఐ-ప్యాడ్‌లు అవసరమవుతాయి. వీరికి తోడు మరో 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. యాపిల్ కంపెనీకి సంబంధించిన ఐ-ప్యాడ్ ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 21,000 నుంచి రూ. 50,000 వరకూ ఉంటుంది. కనిష్ట ధర ఐ-ప్యాడ్‌లు సమకూర్చినా కౌలుదారులు కాకుండా రైతులకే రూ. 7,350 కోట్లు కావాలి. కుటుంబానికి ఒక్కొక్కటి కాకుండా ప్రతి రైతుకూ ఐ-ప్యాడ్ ఇచ్చేటట్టయితే ఈ మొత్తం రూ. 14,700 కోట్లు అవుతుంది. రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలని కోరుతుంటే ఆర్థిక పరిస్థితులు బాగా లేవంటూ కమిటీలతో కాలయాపన చేస్తున్న బాబు ఇప్పుడు.. మరో భారీ ప్రకటన చేయడం సొంత పార్టీ నేతల్లోనే చర్చనీయాంశమైంది.ఎడాపెడా వరాలిచ్చి నవ్వులపాలు కావడమెందుకని నేతలు అంతర్గత సమావేశాల్లో పెదవి విరుస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా కూడా హామీలిస్తారా? అని వ్యవసాయ రంగ నిపుణులు నివ్వెరపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement