
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని శనివారం పలువురు ప్రముఖులు ఫోన్‌లో పరామర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య ఫోన్ చేసి, హత్యాయత్నం ఘటన గురించి జగన్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఇకపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి ఫోన్‌చేసి జగన్ యోగక్షేమాలను తెలుసుకున్నారు. సంఘటన జరిగిన తీరును ఆరా తీశారు. జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శుక్రవారం జగన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగారు.