ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు | CBI raids in MLC vakati Narayana Reddy House | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు

Published Thu, Aug 1 2019 4:04 AM | Last Updated on Thu, Aug 1 2019 9:55 AM

CBI raids in MLC vakati Narayana Reddy House - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో బుధవారం బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో దాదాపు నాలుగు గంటలకుపైగా సీబీఐ అధికారులతో పాటు బ్యాంకు అధికారులూ సోదాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఆర్థిక నేరారోపణల నేపథ్యంలో ఆయనను సీబీఐ అధికారులు గతేడాది జనవరి 21న అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి బెంగళూరు జైలులో ఆయన రిమాండ్‌లో ఉన్నారు. కర్ణాటక హైకోర్టులో పలుమార్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేయగా.. బెయిల్‌ మంజూరుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున బెంగళూరు సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో అధికారులు నెల్లూరుకు చేరుకున్నారు. వాకాటి పీఏ రామకృష్ణకు ఫోన్‌ చేయగా.. తాను తిరుపతిలో ఉన్నానని చెప్పడంతో అధికారులు ఇద్దరు బ్యాంకు ప్రతినిధులను వెంటబెట్టుకుని వాకాటి గృహానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని బెంగళూరుకు వెళ్లిపోయారు. వివరాలు చెప్పేందుకు వారు నిరాకరించారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన వాకాటì.. వీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, వీఎన్‌ఆర్‌ రైల్, లాజిస్టిక్స్‌ తదితర కంపెనీలు నిర్వహిస్తున్నారు.

2014లో హైదరాబాద్‌ షామీర్‌పేటలోని రూ.12 కోట్ల విలువైన భవనానికి నకిలీ డాక్యుమెంట్ల ద్వారా విలువ పెంచి రూ.250 కోట్ల రుణం కోరుతూ ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌సీఐ)కు దరఖాస్తు చేసుకోగా.. రూ.190 కోట్ల రుణం మంజూరు చేసింది. అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో వాకాటి ఆస్తుల జప్తుపై ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ దృష్టి సారించిన క్రమంలో డాక్యుమెంట్లు నకిలీవని తేలింది. దీంతో 2017 మే 5న కార్పొరేషన్‌ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. 2017 మే 12న నెల్లూరు నగరంతో పాటు హైదరాబాద్, బెంగళూరులోని ఆయన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించి 99 కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement