విచిత్రం

bogus ration cards in psr nellore district - Sakshi

జిల్లాలో 7.78 లక్షల కుటుంబాలకు 8.74 లక్షల తెల్లకార్డులు

డబుల్‌ ఎంట్రీలు, బోగస్‌ కార్డులే అధికం

పక్కదారి పడుతోన్న రేషన్‌ సరఫరా

ప్రతి నెలా 15 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా

సాధారణంగా జిల్లాలో కుటుంబాల కంటే రేషన్‌ కార్డులు తక్కువగా ఉంటాయి. లేదంటే కొన్ని సందర్భాల్లో కుటుంబాల సంఖ్యకు సరిసమానంగా అయినా రేషన్‌ కార్డులుండటం సహజం. అయితే జిల్లాలో పరిస్థితి మాత్రం విచిత్రం. కుటుంబాల సంఖ్యకు ఏమాత్రం పొంతన లేకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు లక్ష వరకు అధికంగా రేషన్‌ కార్డులు ఉన్నాయి. డబుల్‌ ఎంట్రీలు, బోగస్‌ రేషన్‌ కార్డులు ఇలా అన్ని కలుపుకుని లక్ష వరకు అదనంగా కార్డులు జిల్లాలో ఉండటం గమనార్హం. ఇటీవలే ఈపాస్‌ మిషన్లను కూడా ట్యాంపరింగ్‌ చేసిన ఘనులు జిల్లాలో ఉన్నారు. దీంతో ప్రతి నెలా వందల టన్నుల రేషన్‌ బియ్యం జిల్లాలో పక్కదారి పడుతోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో మొత్తం 1,873 మంది రేషన్‌ డీలర్ల ద్వారా 8,74,120 మందికి తెల్లరేషన్‌ కార్డుదారులకు రేషన్‌ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇది అధికారిక గణాంకాలు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రం 7,78,420 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా జనాభా సుమారు 29.64 లక్షలు ఉంది. వాస్తవానికి దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాలను గుర్తించి వారికే ప్రతి నెలా రేషన్‌ సరఫరా చేయాల్సి ఉంది. వార్షిక ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని  వారిని గుర్తిస్తారు. ప్రతి పదేళ్లకోసారి జనగణన జరుగుతుంది. అది కూడా సగటున జిల్లా జనాభా ప్రతి పదేళ్లకు 5 నుంచి 10 శాతం లోపు పెరుగుతుంది. ఉద్యోగరీత్యా జిల్లాకు వచ్చే వారు, వ్యాపార నిమిత్తం వచ్చే వారు ఇలా అనేక కేటగిరీల వ్యక్తులు ఉన్నారు. ఈ క్రమంలో సగటున 10 శాతం పెంపుదలను ప్రామాణికంగా తీసుకున్నా వారిలో 6 శాతం మంది దారిద్య్రరేఖ దిగువున ఉన్న మిగిలిన వారు మధ్యతరగతి వారు ఉన్నారు. జిల్లాలో పరిస్థితి మాత్రం గణాంకాలకు పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటికే కుటుంబాల సంఖ్య కంటే 94 వేల కార్డులు అధికంగా ఉన్నాయి. వీటిలో డబుల్‌ ఎంట్రీలు, బోగస్‌ కార్డులు వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే అధికారుల వాదన దీనికి భిన్నంగా ఉంది. గడిచిన ఏడేళ్లలో పెళ్లిళ్లు ఎక్కువ జరిగి వేరు కాపురాలు, కొత్తగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన కుటుంబాల సంఖ్య 2.50 లక్షల వరకు ఉంది. అంటే ఇప్పటికే సగటున 7 నుంచి 10 లక్షలు జిల్లా జనాభా పెరిగింది. దీనిని ప్రామాణికంగా తీసుకుంటే ఉన్న కార్డులు పెద్ద ఎక్కువేమీ కాదని వాఖ్యానిస్తున్నారు.

ఈ–పాస్‌ ట్యాంపరింగ్‌ ఘనులు
రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలో ఈ–పాస్‌ మిషన్ల ట్యాంపరింగ్‌ జిల్లాలోనే జరిగింది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు డీలర్లతో కుమ్మక్కై ఈ–పాస్‌లను ట్యాంపరింగ్‌ చేసి ప్రభుత్వ విలువ ప్రకారం రూ.20 లక్షలు విలువ చేసే బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లోకి తరలించి విక్రయించారు. ఈ వ్యవహరంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌తో కలిపి 46 మందిని అరెస్ట్‌ చేశారు. ఈక్రమంలో 41 మంది డీలర్లను సస్పెండ్‌ చేశారు. దీనికి సంబంధించిన దుకాణలకు సమీపంలోని డీలర్లకు ఇన్‌చార్జిలుగా నియమించారు. అలాగే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి టి.ధర్మారెడ్డిని బాధ్యుడ్ని చేసి సరెండర్‌ చేశారు. ఆయన స్థానంలో గత నెలలో నూతన డీఎస్‌ఓగా ఎంవీ రమణను నియమించారు. అయితే జిల్లాలో గతంలో సస్పెండ్‌ అయిన డీలర్ల వల్ల 30 డిపోలు, తాజాగా సస్పెండ్‌ అయిన 41 మంది వల్ల మరో 41 దుకాణాల డీలర్ల పోస్టులు ఖాళీలయ్యాయి. జిల్లాలో డబుల్‌ ఎంట్రీలు, బోగస్‌ కార్డుల సంఖ్య కొంత ఎక్కుగానే ఉంది.

అనధికారిక సమాచారం ప్రకారం వీటి సంఖ్య 10 నుంచి 12 వేల వరకు ఉండవచ్చు ముఖ్యంగా కోవూరు, నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట, ఉదయగిరి, వెంకటగిరిలో అధికంగా ఉన్నాయి. ఇంటి పేరుతో సçహా ఒక కార్డు, ఇంటి పేరు లేకుండా మరో కార్డు.. ఇలా డబుల్‌ ఎంట్రీ కార్డులతో పాటు, వేల సంఖ్యలో బోగస్‌ కార్డులు ఉన్నాయి. అధికారులు నామాత్రంగా తనిఖీలు నిర్వహించి మామూళ్లతో సరిపెట్టుకోవటంతో కార్డులు ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి. జిల్లాకు తాను కొత్తగా వచ్చానని అన్నింటినీ పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ రమణ సాక్షి ప్రతినిధికి తెలిపారు. అన్నింటినీ పరిశీలించి బోగస్‌ ఉంటే తొలగించటంతో పాటు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top