విజయవాడలోని నార్లతాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్) చరిత్రలో ఆదివారం బ్లాక్ డేగా నిలిచిపోతుంది. ప్లాంటు చరిత్రలో తొలిసారిగా ఆదివారం రాత్రి మొత్తం ఏడు యూనిట్లలోనూ విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
సాక్షి, విజయవాడ: విజయవాడలోని నార్లతాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్) చరిత్రలో ఆదివారం బ్లాక్ డేగా నిలిచిపోతుంది. ప్లాంటు చరిత్రలో తొలిసారిగా ఆదివారం రాత్రి మొత్తం ఏడు యూనిట్లలోనూ విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దాంతో మొత్తం 1,760 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కారణంగా తొలుత ఒక్కోటీ 210 మెగావాట్లతో కూడిన ఆరు యూనిట్లలో ఉత్పత్తి నిలిచి 1,260 మెగావాట్లకు గండిపడింది. 500 మెగావాట్లు ఉత్పత్తి చేసే ఏడో యూని ట్లోనూ అంతరాయం ఏర్పడ్డా వెంటనే పునరుద్ధరించారు. కానీ బొగ్గు అందక, బూడిదతీత సాధ్యపడక ఆదివారం అర్ధరాత్రికల్లా మరోసారి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఎన్‌టీటీపీఎస్‌లో ఒక్క రోజు విద్యుదుత్పత్తికి 25 వేల టన్నుల బొగ్గు అవసరం. అది ఒడిశాతో పాటు తెలంగాణలోని సింగరేణి నుంచి దిగుమతి అవుతుంది. కానీ విద్యుత్ సరఫరా అంతరాయంతో గూడ్‌స రైళ్లను కూడా నిలిపేసిన కారణంగా ఎన్‌టీటీపీఎస్‌కు బొగ్గు సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. దీనికి తోడు ఏడో యూనిట్‌కు బొగ్గు అందించే సిబ్బందితో పాటు దాని నుంచి బయటికొచ్చే బూడిదను తరలించే లారీల యజమానులు సమ్మెలో ఉన్నారు. దాంతో రెండు రోజులుగా బూడిదతీత సాధ్యపడటం లేదు. ఇన్ని సమస్యలు ఒకేసారి చుట్టముట్టడంతో శనివారం ఉద యం నుంచి ఏడో యూనిట్‌లో 300 మెగావాట్ల ఉత్పత్తే సాధ్యపడింది. ఆదివారం అర్ధరాత్రికల్లా పూర్తిగా మూతపడింది.
115 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి గండి!
ఎన్‌టీటీపీఎస్‌లో తొలి ఆరు యూనిట్లు మూడు రోజులుగా పనిచేయడం లేదు. ఒక్క యూనిట్ ఆగితే సుమారు 5 మిలి యన్ యూనిట్ల (ఎంయూ) ఉత్పత్తి ఆగిపోతుంది. ఆ లెక్కన 3 రోజులుగా 5 యూనిట్లలో 75 ఎంయూ ఉత్పత్తి ఆగిపోయింది. ఇక ఏడో యూనిట్ ఆగిపోతే రోజుకు 12 ఎంయూ నష్టం వస్తుంది. ఇలా సోమవారం సాయంత్రానికి మొత్తం మీద ఎన్‌టీటీపీఎస్‌లో 115 ఎంయూ ఉత్పత్తి ఆగినట్టు అవుతుందని అధికారులు తెలిపారు.రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌లో 40 శాతం సరఫరా అయ్యే ఎన్టీటీపీఎస్ పూర్తిగా మూగబోవడంతో ఆంధ్రప్రదేశ్ గ్రిడ్ విఫలమయ్యేలా ఉందని, అదే జరిగితే రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పునరుద్ధరణకు రోజున్నర: ఎన్‌టీటీపీఎస్‌లో ఏడు యూనిట్లూ ఒకేసారి మూతబడ్డందున వాటి పునరుద్ధరణ కాస్త కష్టసాధ్యమేనంటున్నారు. కేంద్రం దిగొచ్చేదాకా విధులకు హాజరయ్యేది లేదని జేఏసీ నేతలు తేల్చిచెబుతుండటం తెలిసిందే. వారు హాజరయ్యాక కూడా ఎన్‌టీటీపీఎస్ పూర్తిస్థాయి సామర్థ్యంలోకి రావడానికి కనీసం రోజున్నర పడుతుందని జన్‌కో డెరైక్టర్ ఆంజనేయరావు ‘సాక్షి’కి తెలిపారు.