హాజరు..అలంకారప్రాయం

Biomtric Missions No Use in SKU Anantapur - Sakshi

రూ.7.20 లక్షలు వెచ్చించి కొనుగోలు     చేసినా     నిరుపయోగం

గోడలకే పరిమితమైన బయోమెట్రిక్‌ పరికరాలు

ప్రతి నెలా  రూ.వేలతో రీచార్జ్‌

గుర్తింపుకార్డు జారీలోనూ చేతివాటం

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర ఉద్యోగుల హాజరు కోసం ఏర్పాటు చేసిన ఆధార్‌ బయోమెట్రిక్‌  పరికరాలు అలంకారప్రాయంగా మిగిలాయి. ఉద్యోగుల సమయ పాలన కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన హాజరు యంత్రాలు వినియోగంలోలేకుండా పోయాయి. ఫలితంగా నిధులు దుర్వినియోగమయ్యాయి.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర ఉద్యోగుల హాజరుకోసం రెండేళ్ల క్రితం  మొత్తం 40 బయోమెట్రిక్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క రోజు కూడా పని చేయలేదు. 40 బయోమెట్రిక్‌ పరికరాలకు మొత్తం రూ.7.20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. బయోమెట్రిక్‌ పరికరాలు కేవలం అలంకారప్రాయంగా గోడలకే పరిమితమయ్యాయి. రూ.లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఉద్యోగులు , విద్యార్థులు సమయపాలన పాటించడం లేదు.

రీఛార్జ్‌ మాత్రం ఫుల్‌
వర్సిటీలో ఏర్పాటు చేసిన పనిచేయని బయోమెట్రిక్‌ పరికరాలకు మాత్రం క్రమం తప్పకుండా రీఛార్జ్‌  చేస్తున్నారు. ప్రతి నెలా 40 సిమ్‌లకు రూ.11,500 రీఛార్జ్‌ చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులను సైతం ప్రతి నెలా విశ్వవిద్యాలయం చెల్లిస్తోంది. ఇప్పటి దాకా రీచార్జ్‌లకే రూ.2 లక్షలకు పైగా డబ్బులు చెల్లించి వర్సిటీ నిధులు దుర్వినియోగం చేశారు. బయోమెట్రిక్‌ పరికరాలకు చెల్లించిన మొత్తంతో పాటు రీఛార్జ్‌ నిధులు దుర్వినియోగమయ్యాయి. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఐడీ కార్డులకు లక్షల్లో నిధులు మంజూరు
వర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగులకు ఐడీ (వ్యక్తిగత గుర్తింపు కార్డులు )లు జారీ చేశారు. అయితే ఇందులోనూ  చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది జూలై 10న ఐడీ కార్డులను జారీ చేశారు. 2 వేల మందికి ఐడీ కార్డులు జారీ చేయడానికి కేవలం రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్ష వరకు ఖర్చవుతుంది. కానీ ఏకంగా  రూ.4,74,144 ఐడీ కార్డులు జారీ చేసినందుకు చెల్లించారు. ఇందులోనూ మూడింతలు «అధిక మొత్తాన్ని చేతివాటం ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐడీ కార్డుల జారీలో క్లాత్‌ ట్యాక్‌ ఒక్కొక్కటి నాణ్యత గల వస్తువు మార్కెట్‌లో రూ.5లు అందుబాటులో ఉండగా, రూ. 9లు చెల్లించారు. మైఫై కార్డులు రూ.7లు అందుబాటులో ఉండగా, రూ.13 చెల్లించారు. ఇలా ప్రతి వస్తువులోనూ అధిక ధరకు కోట్‌ చేసి స్వాహా చేశారు. ఐడీ కార్డుల ప్రింటర్‌కు రూ. 57 వేలు చెల్లించారు. ఇలా ప్రతి అంశంలోనూ అందినకాడికి దోచుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి వర్సిటీ నిధులను స్వాహా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top