బ్యాడ్ ‘ల్యాండ్‌లైన్’

బ్యాడ్ ‘ల్యాండ్‌లైన్’

  •      సక్రమంగా పనిచేయని బీఎస్‌ఎన్‌ఎల్ ఫోన్లు

  •      గతేడాది 4వేల మంది ఉపసంహరణ

  •      తీరుమారని బీఎస్‌ఎన్‌ఎల్

  • విశాఖపట్నం : ఆధునిక సాంకేతిక విప్లవంలో రోజుకో మోడల్ సెల్‌ఫోన్ రకరకాల ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేస్తోంది. సామాన్యులకు అందుబాటు ధరలో లభించడంతో వీటివైపు ప్రజలు మక్కువ చూపిస్తున్నారు. 2జీ, 3జీ, 4జీ సేవలు అందుబాటులోకి రావడంతో మరింత గిరాకీ పెరిగింది. మొబైల్ ఫోన్ల ప్రభంజనానికి ల్యాండ్‌లైన్ ఫోన్ల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. ఇటువంటి సమయంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి, వారి మెప్పు పొందాల్సిన బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బందికి చీమకుట్టినట్టయినా లేదు.



    పదే పదే ఫోన్లు మరమ్మతులకు గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో ల్యాండ్ లైన్ల ఫోన్ల సంఖ్య తగ్గిపోతుంది. విశాఖపట్నం టెలికం జిల్లా పరిధిలో ప్రస్తుతం లక్షా వెయ్యి వరకు ల్యాండ్‌లైన్ టెలిఫోన్లు ఉన్నాయి. తద్వారా సంస్థకు ఏటా రూ.80 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతోంది. ఇప్పటికీ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ల్యాండ్‌లైన్ టెలిఫోన్ల ద్వారానే అధికంగా ఆదాయం వస్తోంది.



    అయినా సిబ్బందిలో అంకితభావం మాత్రం కానరావడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేలు ల్యాండ్‌లైన్ వినియోగదారులు ఫోన్లు ఉపసంహరించుకున్నారు. ఇదే కాలంలో సుమారుగా 8 వేల మంది కొత్తగా ల్యాండ్‌లైన్ టెలిఫోన్లు తీసుకున్నారు.

     

    మరమ్మతులతో సరి?

     

    ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, వన్‌టౌన్, కంచరపాలెం తదితర ప్రాంతాల్లో ల్యాండ్‌లైన్ ఫోన్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, కొత్త పరికరం అవసరమైనా మరమ్మతులతో సరిపెడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో వాయిస్ స్పష్టంగా వినిపించడం లే దని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం లో ఫోన్ క్రెడిల్ సక్రమంగా పనిచేయని కారణంగా పేపర్ వెయిట్ సాయం తీసుకోవల్సిన దుస్థితి నెలకొంది. గతంలో ఉచితంగా ఫోన్లు మార్చే సంస్థ ఇప్పుడేమే రూ.500 వసూలు చేస్తుంది.

     

    రోడ్లు తవ్వితే అంతే...

     

    జీవీఎంసీ పరిధిలో పలు ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. బీఆర్‌టీఎస్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లు తవ్వినపుడు వందలాది బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్లు మూగబోతున్నాయి. డయల్ బి ఫోర్ డిగ్ అని బీఎస్‌ఎన్‌ఎల్ జంక్షన్ల వద్ద బోర్డులు ఉన్నా కాంట్రాక్టర్లు ముందుగా సమాచారం ఇవ్వకుండానే తవ్వకాలు జరపడంతో ఈ దుస్థితి నెలకొంటుంది. అయినా అధికారులు కాంట్రాక్టర్లపై కేసులు పెడుతున్న దాఖలాలు లేవు.

     

     కొత్త పరికరాలకు కొరత లేదు




     గతంలో ల్యాండ్‌లైన్ టెలిఫోన్ పరికరాలు ఢిల్లీ నుంచి వచ్చేవి. కొంతకాలంగా హైదరాబాద్ నుంచే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతానికి పరికరాల కొరత లేదు. అవసరం అయిన వారికి పాత ఫోన్ల స్థానంలో కొత్తవి ఇస్తున్నాం. రోడ్ల తవ్వకాల కారణంగా ఫోన్లు డెడ్ అయితే సంబంధిత కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తున్నాం.

     - ఆర్.ఎం.ఎం.కృష్ణ,

     సీనియర్ జనరల్ మేనేజర్, బీఎస్‌ఎన్‌ఎల్, విశాఖపట్నం


     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top