కొన్ని స్కూళ్ల యాజమాన్యాల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు...పలుమార్లు ఈ విషయాలు నా దృష్టికి వచ్చాయి..
కలెక్టర్ కోనశశిధర్
అనంతపురం ఎడ్యుకేషన్ : ‘కొన్ని స్కూళ్ల యాజమాన్యాల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బం దులు పడుతున్నారు...పలుమార్లు ఈ విషయాలు నా దృష్టికి వచ్చాయి.. అందుకే తనిఖీలు చేయిస్తున్నాం.. దీనిని ఆపే ప్రసక్తే లేదు.’అని కలెక్టర్ కో న శశిధర్ స్పష్టం చేశారు. విద్యా స ంస్థల్లో అధిక ఫీజులు వసూళ్లు, వసతుల లేమిపై అధికార బృందాలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం నాయకులు క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ను కలిశారు.
తనిఖీలు చేయడం వల్ల చాలామంది యాజమాన్యాలు ఆందోళనకు గురువుతున్నారని విన్నవించారు. దీనిపై కలెక్టర్ పైవిధంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ మన జిల్లా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి వారి ఆమోదం మేరకు ఫీజులు వసూలు చేయాలని సూ చించారు. జిల్లాలో ఏ ఒక్క స్కూలును ఉపేక్షించబోమన్నారు. ఇప్పటిదాకా నగరంలోనే దాడులు చేస్తున్నారని, వచ్చేవారం నుంచి జిల్లా అంతటా ఈ తనిఖీలు నిర్వహిస్తారని స్పష్టం చేశారు.
అన్ని స్కూళ్లను ఒకేలా చూడమని, అక్కడి పరిస్థితులను పరి శీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం నాయకులు పోలం రంగారెడ్డి, కుళ్లాయిరెడ్డి, రవిచంద్రారెడ్డి, గోపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
కొనసాగిన దాడులు:
నగరంలో శనివారం 18 స్కూళ్లను అధికార బృందాలు తనిఖీలు చేశాయి. ఏజేసీ సయ్యద్ ఖాజామోహిద్దీన్, డీఆర్‌ఓ హేమసాగర్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఫరూఖ్ అహ్మద్, ఆర్డీఓ హుసేన్‌సాబ్, డీఈఓ అంజయ్య, ఎస్‌ఎస్‌ఏ పీఓ జయకుమార్ నేతృత్వంలో నాలు గు బృందాలు ఏర్పడి నగరంలో కలియతిరిగారు. పేరెంట్-టీచర్ అసోసియేషన్ సమావేశాల అమలు, ఆటస్థలం, మరుగుదొడ్లు, టీచర్ల నియామకం, వేతనాల మంజూరు, స్కూళ్లలో అగ్నిమాపక నిరోధక పరికరాలు, ప్రాథమిక చికిత్స కిట్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు.