విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరించడంపై విద్యార్థినులు సమరభేరి మోగించారు.
వైవీయూ, న్యూస్‌లైన్: విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరించడంపై విద్యార్థినులు సమరభేరి మోగించారు. అభినవ కీచకుడిలా ప్రవర్తిస్తున్న సుబ్రమణ్యం అనే వృత్తి విద్యా ఉపాధ్యాయుడిపై వారు ధ్వజమొత్తారు. ఆయనపై చర్యలు తీసుకోకుంటే తామంతా పాఠశాల వీడక తప్పదని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో వృత్తివిద్యా ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న సుబ్రమణ్యం విద్యార్థినులతో అసభ్య ప్రేలాపనలు చేస్తూ, వారితో వెకిలిచేష్టలు, ద్వందార్థాలు వచ్చేలా మాట్లాడటంతోపాటు వారిని తగలరాని చోట తాకుతూ తనలోని కామ వాంఛను తీర్చుకునేయత్నం చేసేవాడు.
కొన్నేళ్లుగా ఆయన ప్రవర్తన ఇలాగే సాగుతుంటే అప్పట్లో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు సంబంధిత ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి మరింత రెచ్చిపోయిన ఆయన మహిళా ఉపాధ్యాయులపై కూడా దూషణల పర్వం కొనసాగించేవాడు. విద్యార్థినులు ఎవరైనా ఆలస్యంగా వస్తే.. వారిని అనరాని మాటలు అనడంతోపాటు సెక్సు గురించి తెలుసుకోవాలంటూ బూతు పురాణం మొదలెట్టేవాడు. చాలాకాలంపాటు భరించిన విద్యార్థినులు ఎట్టకేలకు మానవహక్కుల వేదికకు ఫిర్యాదు చేశారు.
కీచకోపాధ్యాయునిపై ఫిర్యాదులు
ఫిర్యాదు అందుకున్న మానవహక్కుల వేదిక ప్రతినిధులు శుక్రవారం నగరంలోని గాంధీనగర్ ఉన్నత పాఠశాలలో విచారణ చేశారు. ప్రత్యేక గదిలో విద్యార్థినులను విచారించగా వారు కన్నీటిపర్యంత మయ్యూరు. తాము ఆ ఉపాధ్యాయుని వల్ల చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నామంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పేద విద్యార్థులమైన మేము విషయం బయట పడితే చదువుమాన్పిస్తారన్న భయంతో బయటకు చెప్పలేకపోతున్నామన్నారు. అయినా ఆయన ఆగడాల ఎక్కువ కావడంతో తప్పని పరిస్థితుల్లో ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.
డీఈఓకు ఫిర్యాదు
సదరు వృత్తివిద్యా ఉపాధ్యాయుడుపై మానవహక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ డీఈఓ కె. అంజయ్యకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు లిఖిత పూర్వకంగా చేసిన ఫిర్యాదులను అందజేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన డీఈఓ మాట్లాడుతూ దీనిపై సమగ్ర విచారణ చేసి నివేదికను మున్సిపల్ కమిషనర్‌కు అందజేసి చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాధామహిళా మండలి అధ్యక్షురాలు పి. పద్మావతి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంజీవమ్మ తదితరులు పాల్గొన్నారు.
కఠినంగా శిక్షించాలి
ఉపాధ్యాయులపై ఆరోపణలు వచ్చినప్పుడే కేవలం సస్పెన్షన్‌లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అలా కాక కఠినశిక్షలు విధించాలి. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పేద విద్యార్థినులతో ఇలా వ్యవహరిస్తే కఠినంగా శిక్షిస్తేనే మరొకరు చేయడానికి భయపడతారు.
- జయశ్రీ, మానవహక్కుల వేదిక కన్వీనర్