స్తంభించిన రైళ్లు | Arrested trains | Sakshi
Sakshi News home page

స్తంభించిన రైళ్లు

Oct 13 2014 4:19 AM | Updated on Sep 2 2017 2:44 PM

స్తంభించిన రైళ్లు

స్తంభించిన రైళ్లు

తూర్పు కోస్తా రైల్వేలోని ప్రధానమైన విశాఖ రైల్వే స్టేషన్ చిగురుటాకులా వణికిపోయింది. శనివారం అర్ధరాత్రి నుంచే మొదలైన గాలులకు రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు.

విశాఖపట్నం సిటీ: తూర్పు కోస్తా రైల్వేలోని ప్రధానమైన విశాఖ రైల్వే స్టేషన్ చిగురుటాకులా వణికిపోయింది. శనివారం అర్ధరాత్రి నుంచే మొదలైన గాలులకు రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. భీకర గాలులకు ఎగిరిపోతున్న పైకప్పులను సరి చేసే లోపే మరో ప్లాట్‌ఫాం మీద వున్న పై కప్పులు ఎగిరిపోతుండడంతో ఆఖరికి సిబ్బంది సైతం చేతులెత్తేశారు. ప్లాట్‌ఫార పై ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి.

ప్లాట్‌ఫాంపై వున్న ఐఆర్‌సీటీసీ దుకాణాలన్నీ బంతుల్లా దొర్లాయి. విశాఖ రైల్వే స్టేషన్‌లోని 8 ప్లాట్‌ఫాంలపై ఉన్న ఆస్‌బెస్టాస్ సిమెంట్ రేకులు, ఐరన్ షీట్లు కాగితాల్లా ఎగిరిపోయాయి. అత్యవసర ప్రయాణాలు చేద్దామనుకున్న వారంతా చిగురుటాకుల్లా వణికిపోయారు. రైళ్లరద్దుతో వేలాది మంది ప్రయాణికులు వచ్చి టికెట్లు రద్దు చేసుకుంటారనుకున్నా భయంకర తుఫాన్‌కు ఎవరు స్టేషన్ వైపు రాలేదు. వచ్చిన వారు మాత్రం ఎటూ వెళ్లలేక స్టేషన్‌లోనే దిగాలుగా పడిగాపులు కాస్తున్నారు. ఏ సమాచారం తెలియక తంటాలు పడుతున్నారు. రైల్వే ఉద్యోగులు సైతం ఆదివారం విధుల్లోకి రావాల్సిన వారంతా రాలేదు. దీంతో శనివారం రాత్రి విధుల్లో వున్న వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు.
 
ఖాళీ రైళ్లు ఢీ: తూర్పు కోస్తా రైల్వే చిగురుటాకులా వణికిపోయింది. హుదూద్ తుఫాను బీభత్సం సృష్టించనుందని ముందే హెచ్చరించడంతో దాదాపు 50కు పైగా రైళ్లను ఎక్కడున్న వాటిని అక్కడే నిలిపివేసినా వాటిని నియంత్రించడం కష్టతరమైంది. విశాఖలో నిలిపివేసిన పలు రైళ్లు భారీ ఈదురుగాలులకు పట్టాలపై దొర్లుకుపోవడం రైల్వే వర్గాలను కలవరపెట్టాయి. అందులో ప్రయాణికులు లేకపోయినా ఈదురు గాలులకు రైళ్లు సైతం కొట్టుకుపోతున్నాయని కలవరపడ్డారు. ఆదివారం రోజంతా అవి  ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూనే ఉన్నాయి. బ్రేక్‌లపై నిలిపివేసిన రైళ్లు సైతం చిగురుటాకుల్లా దొర్లిపోయేవి. వాటిని పట్టాలపై నియంత్రించడం సాధ్యమయ్యేది కాదు.
 
ప్రయాణాలకు బ్రేక్

గత రెండు రోజులుగా విశాఖలో హుదూద్ చేస్తున్న హడావుడితో పలువురు ప్రయాణాలు బ్రేక్ చేసుకున్నారు. వేలాది మంది తమ టికెట్లను శనివారం రాత్రే రద్దు చేసుకున్నారు. దాదాపు నాలుగు నుంచి 5 వేల మంది ప్రయాణికులకు రూ. కోట్లలో చెల్లింపులు(రిఫండ్) చేశారు. మరో రెండు మూడు రోజుల వరకూ ప్రయాణాల పరిస్థితి మందకొడిగానే కొనసాగే అవకాశాలున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement