ఆదిత్యా మన్నించు!

Arasavalli Temple Income Special Story - Sakshi

ఖర్చు బారెడు...ఆదాయం మూరెడు !

రథసప్తమి ఆదాయం రూ.32.86లక్షలు

గతేడాది కంటే స్వల్పంగా పెరిగిన వైనం

ఆదాయం కంటే ఖర్చులే అధికం

నిత్యం కనిపిస్తున్న సూర్యదేవుని వెలుగుని ఆపడం సృష్టిలో ఎవ్వరికీ సాధ్యం కాని పని. అయితే ఆ సూర్యదేవుడే కొలువైన క్షేత్రానికి  రావాల్సిన ఆదాయ వెలుగులను ఆపడం మాత్రం సాధ్యమే అని రుజువైంది. ప్రసిద్ధ పుణ్య       క్షేత్రం అరసవల్లిలో రథసప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవమైన శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి మరీ ఆయనపై పైచేయి సాధించినంత పని చేశారు కొంతమంది. లక్షలాది రూపాయల ఆదాయానికి గండి పడడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

శ్రీకాకుళం, అరసవల్లి: అరసవల్లిలో సోమవారం అర్ధరాత్రి తరువాత నుంచి మంగళవారం సాయంత్రం వరకూ రథసప్తమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వేలాది మంది స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే ఆ స్థాయిలో ఆలయానికి ఆదాయం మాత్రం సమకూరలేదు. దీనికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఉత్సవంలో ప్రధానంగా పోలీసు శాఖతో పాటు పలు శాఖలకు చెందిన కొందరు అధికారులు నిర్వహించిన ప్రధాన పాత్ర ఓ వైపు ఆలయ ఆదాయాన్ని ముంచేస్తే...మరో వైపు సామాన్య భక్తుల మనోభావాలను తీసినట్లు కన్పించింది. ఏటా సప్తమి రోజున లక్షల్లో భక్తులు అరసవల్లితరలిరావడంతో ఆదాయం కూడా రూ. లక్షల్లోనే సమకూరేది. అయితే గతేడాది నుంచి రథసప్తమి ఉత్సవాల్లో పోలీసు శాఖతో పాటు పలు కీలక శాఖాధికారుల బంధుప్రీతి ఫలితంగా ఆలయ ఆదాయం తగ్గడం ప్రారంభమైందనే విమర్శలు వస్తున్నాయి.

తగ్గుతున్న ఆదాయం– పెరుగుతున్న ఖర్చు
రథసప్తమి పర్వదినాన వేలాది మంది భక్తులు అరసవల్లి ఆలయంలో పలు ఆర్జిత సేవలతో పాటు దర్శనాల టిక్కెట్లు కొనుగోలు చేయడంతో ఆలయానికి ఆదాయం సమకూరుతుంది. ఈ మహోత్సవానికి నెల రోజుల ముందు నుంచే జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలయ అధికారులు వివిధ ఏర్పాట్లను చేయిస్తుంటారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తారు. బారికేడ్లు, క్యూలైన్లు, విద్యుత్‌ కాంతుల డెకరేషన్, పుష్పాల అలంకరణ, క్లాత్‌ డెకరేషన్, పారిశుద్ద్య పనులు, రంగులు, సిబ్బంది భోజనాలు, వివిధ రకాల ప్రచారాలు ఇతరత్రా ఏర్పాట్లు చేసేందుకు ఆలయ నిధులను మాత్రమే ఖర్చు చేస్తారు. గతేడాది సప్తమికి సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసి, ఏర్పాట్లు భారీగా చేపట్టినప్పటికీ, భక్తులు అంతస్థాయిలో రాకపోవడంతో ఆదాయం రూ. 32.74 లక్షల వరకు వచ్చింది. ఇందులో అర్చకులు, క్షురకుల షేర్లు మినహాయిస్తే, ఆ ఆదాయం సుమారు రూ.28 లక్షలకు తగ్గింది. దీంతో గతేడాది కూడా ఖర్చుకు తగ్గ ఆదాయం రాలేదని వివరాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా పరిస్థితులను చూస్తే...ఆదాయం మాత్రం రూ.32.86 లక్షలని అధికారులు ప్రకటించినప్పటికీ, ఎవరి వాటాలు వారికి మినహాయిస్తే ఆదాయం రూ.29.99 లక్షలకు పడింది. ఈ ఏడాది సప్తమి ఏర్పాట్ల కోసమే సూమారు రూ.40 లక్ష ఖర్చు చేసినట్లు సమాచారం. దీంతో ఆదాయానికి తగిన ఆదాయం ఈసారి కూడా రాని పరిస్థితి. వాస్తవానికి ఆలయాలు వాణిజ్య, వ్యాపార కేంద్రాలు కాకపోయినప్పటికీ భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ, దర్శన టిక్కెట్లు, వివిధ రకాల సేవల టిక్కెట్లు ద్వారా ఆదాయం సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టడం తప్పేమీ కాదు. కానీ అరసవల్లి ఆలయానికి రథసప్తమి రోజున గత రెండుమూడేళ్లుగా ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం మాత్రం రావడం లేదు.

ఆదాయం సమకూరింది ఇలా..
ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా అరసవల్లి ఆలయానికి వివిధ దర్శనాల టిక్కెట్లు, సేవలు, ప్రసాదాల రూపంలో మొత్తం రూ. 32,86,968 ఆదాయం లభించిందని ఆలయ ఈవో ఆర్‌.పుష్పనాథం బుధవారం ప్రకటించారు. 

వంద రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ. 10,43,500, 5 వందల రూపాయల క్షీరాభిషేకం (1205 టిక్కెట్లు) విక్రయం ద్వారా రూ. 6,02,500,  5 వందల రూపాయల విశిష్ట దర్శనం టిక్కెట్లు 535 విక్రయం ద్వారా రూ. 2,67,500 ఆదాయం సమకూరింది. అలాగే శాశ్వత ఉభయాలు ద్వారా రూ.43,796,  కేశఖండన శాల టిక్కెట్లు ద్వారా రూ.46,250, ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 12,56,115, విరాళాలుగా రూ.27,307 చొప్పున ఆదాయం లభించినట్లు లెక్కలు వివరించారు. అయితే ఇందులో క్షీరాభిషేకం టిక్కెట్లలో అర్చకుల షేర్‌ ఉంది. ఒక్కో టిక్కెట్టు ధర రూ.500 కాగా, ఇందులో రూ.200 అర్చకులకు పూజాద్రవ్యాల కొనుగోలు నిమిత్తం షేర్‌గా ఆలయ అధికారులు చెల్లించాల్సి ఉంటుంది.

ఈమేరకు రథసప్తమికి మొత్తం 1205 టిక్కెట్లు విక్రయించగా, ఇందులో అర్చకులకు రూ. 2.41 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, ఆలయానికి రూ. 3.61,500 ఆదాయంగా మిగులనుంది. అలాగే కేశఖండన శాల టిక్కెట్లతో రూ. 46,250 ఆదాయం రాగా, ఈమొత్తం కూడా తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అధికారికంగా పనిచేసే 12 మంది క్షురకులకే చెల్లించాల్సి ఉంది. దీంతో తాజాగా ప్రకటించిన ఆదాయంలో అర్చకులు, క్షురకులకు చెల్లింపులను మినహాయించాల్సి ఉంది. దీంతో మిగిలిన ఆదాయంగా రూ.29,99,718 వచ్చినట్‌లైంది. ఇదిలావుంటే గతేడాది సప్తమికి మొత్తం రూ.32,74293 ఆదాయం లభించగా, నాటి పరిస్థితుల్లో క్షీరాభిషేకం టిక్కెట్టు ధర రూ.216 కాగా, ఇప్పుడు రూ.500కి పెరిగింది. అలాగే కేశఖండన శాల టిక్కెట్టు రూ.10లో సగం ధర ఆలయానికి చెందేది. ఇప్పుడు ధర రూ.25 కాగా, మొత్తం క్షురకులకే చెందుతుంది. దీంతో గతేడాదితో పోల్చితే ఆదాయం తగ్గినట్‌లైంది. దీనికితోడు హుండీల ద్వారా కూడా ఈసారి ఆదాయం పెద్దగా రాకపోవచ్చుననే అంచనాలున్నాయి.

సిఫారసుల ఫలితమే!
గత రెండేళ్ల నుంచి రథసప్తమికి భక్తుల తాకిడి రికార్డుల్లోకి నమోదు కావడం లేదు.  భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ..అధిక సంఖ్యలో భక్తులు వివిధ రూపాల్లో సిఫారసులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండడం కన్పిస్తోంది. గతేడాది కూడా పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు తలెత్తాయి. తాజా రథసప్తమి ఉత్సవానికి కూడా పోలీసు శాఖతో పాటు మరో రెండు కీలక శాఖల హడావుడి, బంధుప్రీతిపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. సాధారణ భక్తుల్లో అసంతృప్తి, అసహనం వ్యక్తమయ్యింది. భారీ సంఖ్యలో తమ వారిని దర్శనాలకు వీవీఐపీ, దాతల పాసుల లైన్లో నుంచి పంపించడంతో ఆలయ ఆదాయానికి రూ. లక్షల్లో గండిపడింది. దీంతో క్షీరాభిషేకం, విశిష్ట దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శనాలు కూడా దారుణంగా తగ్గిపోయాయి.  టిక్కెట్లు ధర పెరగడంతో కాస్తా అంకెల్లో బాగా కన్పిస్తున్నా...ఖర్చులతో పోల్చితే భారీగా ఆదాయం తగ్గినట్లైంది. ఇదిలాఉండే ఆలయ ఈవో ఆర్‌.పుష్పనాథం, అధికార సిబ్బందితో ఖరారు చేయించుకుని ఆదాయ వివరాలను ప్రకటించారు. ఆదాయం తగ్గడానికి పూర్తిగా పోలీసు శాఖ నిర్వాకమే అని, అందులో కొందరి వైఖరిపై తీవ్రంగా చర్చించుకున్నట్లు తెలిసింది. మరో రెండు కీలక శాఖల అధికారుల్లో కొందరు వల్ల కూడా నకిలీ వీవీఐపీలు పెరిగిపోవడంతో ఆదాయం తగ్గినట్లు గుర్తించినట్లు సమాచారం. ఇలాంటి వ్యవహారాలు ఇకముందు జరగకుండా చేయాల్సిన విధివిధానాలపై కూడా ఆయన సమాలోచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top