బస్సు.. నిర్వహణ తుస్సు

APS RTC Bus Services Delayed in Visakhapatnam - Sakshi

డొక్కు బస్సులతో బండి లాగుతున్న ఆర్టీసీ

తరచూ రిపేర్లతో ఆదాయం కోల్పోతున్న సంస్థ

టీటీడీ పక్కనపెట్టిన బస్సులు జిల్లాకు కేటాయింపు

ఎక్స్‌ప్రెస్‌లుగా మినీ బస్సులు

పశ్చిమ ఆర్టీసీపై ప్రభుత్వం చిన్నచూపు

అవస్థలు పడుతున్న ప్రయాణికులు

పశ్చిమగోదావరి, ఆకివీడు : ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖవంతం అంటూ ఆ సంస్థ ప్రకటనలు ఇస్తుంది. ఇది ప్రతి బస్సులోనూ రాసి ఉంటుంది. అయితే ప్రస్తుత ఆర్టీసీని పరిశీలిస్తే సురక్షితం వరకు బాగానే ఉన్నా సుఖవంతం మాత్రం కాదు. ప్రస్తుతం నడుస్తున్న బస్సుల్లో చాలావరకు కాలం చెల్లినవే. డొక్కు బస్సులను నడుపుతూ ప్రయాణికులతో ఆటలాడుతోంది.

జిల్లాలో 624 బస్సులు
జిల్లాలో ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నరసాపురం డిపోలు ఉన్నాయి. ఈ డిపోల్లో వివిధ రూట్లలో 624 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 64 బస్సులు కాలం చెల్లినవి ఉన్నాయి. మరో 80 బస్సులు పాడైపోయి అధ్వానంగా మారాయి. తరచూ రిపేర్లతో సతాయిస్తున్నాయి. ఇంకొన్ని బస్సులు రణగొణధ్వనులతో ఘీంకరిస్తున్నాయి. పల్లె వెలుగు బస్సులు ఎక్కడా మెరవడంలేదు. అద్దె బస్సులు కూడా అధ్వానంగా తయారయ్యాయి. కిటికీల అద్దాలు, క్యాబిన్‌ చప్పుడులతో ప్రయాణికులు ఆర్టీసీ ప్రయాణమంటేనే భయపడుతున్నారు. చెవులు చిల్లులు పడిపోతున్నాయని వాపోతున్నారు.

వివిధ రూట్లలో 150 బస్సులు అవసరం
బస్సులు నడిచేందుకు అనువుగా ఉన్న వివిధ రూట్లలో మరో 150కి పైగా బస్సులు తిరిగే అవకాశం ఉంది. ప్రయాణికులు అధికంగా ప్రయాణించే రూట్లలో మరికొన్ని అదనపు బస్సులు సుమారు 70కి పైగా వేయాల్సి ఉంది. వివిధ రూట్లలో బస్సులు నడపకుండా, ఉన్న రూట్లలో చెత్త బస్సులు నడుపుతున్నప్పటికీ ప్రయాణికులు ఆర్టీసీకి నెలకు రూ.20 లక్షల మేర ఆదాయం సమకూర్చుతున్నా ప్రభుత్వం మంచి బస్సులను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉంది. జిల్లాలో ప్రతి నెలా రూ.17 లక్షల ఆదాయం వచ్చే ఆర్టీసీకి గతేడాది డిసెంబరు నెల నుండి క్రమేపీ ఆదాయం పెరుగుతోంది. ప్రస్తుతం రూ.20 లక్షల మేర ఆదాయం వస్తోంది.

జిల్లాకు పాతబస్సుల కేటాయింపు
ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో పయనిస్తున్న పశ్చిమ ఆర్టీసీకి ఉన్నతాధికారులు పాత బస్సులనే కేటాయిస్తున్నారు. కొత్తబస్సుల కేటాయింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. కొత్త బస్సులు కేటాయిస్తే నష్టాలు మరింత తగ్గి అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన 34 మినీ బస్సులను ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. ఇవే మరో 14 త్వరలో రానున్నాయి. తిరుపతి–తిరుమల మధ్య నడిచే ఈ బస్సులను వాటి కండీషన్‌ బాగోలేకపోవడంతో టీటీడీ పక్కన పెట్టింది. వాటిస్థానంలో కొత్తవి ప్రవేశపెట్టింది. ఈ బస్సులను ఆర్టీసీ వేలంలో కొనుగోలు చేసి వివిధ జిల్లాలకు కేటాయిస్తోంది. అందులో మన జిల్లా అత్యధికంగా ఇచ్చారు. అక్కడ పనిచెయ్యని బస్సులను ఇక్కడకు తీసుకొచ్చి తిప్పుతున్నారు. అందులో కొన్ని డిపోల్లో వాటిని ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులుగా దూరప్రాంతాలకు తిప్పుతుండడం గమనార్హం. నడ్డి విరిచే బస్సులు మాకు వద్దని, కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఆర్టీసీకి దీటుగా ఆటోలు
జిల్లాలో బస్సులు తిరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కూడా ఆర్టీసీ తిరగకపోవడం, ఉన్న బస్సులు సకాలంలో నడవకపోవడంతో ఆర్టీసీకి దీటుగా ఆటోలు తిరుగుతున్నాయి. చెయ్యి ఎత్తితే ఆర్టీసీ ఆపుతామని చెప్పే నినాదం కనుమరుగైంది. దీంతో ఆటోలు ఇంటి వద్ద ప్రయాణికుల్ని దింపుతున్నంత భావన ప్రతి ఒక్కరిలో ఏర్పడటంతో ప్రజలు ఆటోలవైపు మొగ్గు చూపుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top