ఈ ఏడాది ఏపీలోకి అపర్ణా ప్రాజెక్ట్స్

ఈ ఏడాది ఏపీలోకి అపర్ణా ప్రాజెక్ట్స్


35 లక్షల చదరపు అడుగుల్లో రెండు ప్రాజెక్టులు

అపర్ణా సరోవర్ గ్రాండ్‌కు ఐజీబీసీ ప్లాటినం గుర్తింపు

అపర్ణా కన్ స్ట్రక్షన్స్ డెరైక్టర్ డీఎస్ ప్రసాద్


 

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగు పెడుతోంది. ఈ ఏడాది ముగిసేనాటికి విజయవాడ-గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీకి చేరువలో 35 లక్షల చదరపు అడుగుల్లో రెండు భారీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు సంస్థ డెరైక్టర్ డి.ఎస్.ప్రసాద్ చెప్పారు. హైదరాబాద్‌లోని నల్లగండ్లలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న అపర్ణా సరోవర్ గ్రాండ్ ప్రాజెక్టుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్లాటినం గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా శనివారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘అపర్ణా సంస్థను 1996లో ప్రారంభించాం. 2001 నుంచి రియల్టీ మార్కెట్లో క్రియాశీలంగా ఉన్నాం. గత 15 ఏళ్లుగా నగరంలో విభిన్న ప్రాజెక్టులతో అందుబాటు ధరల్లో కొనుగోలుదారుల సొంతింటి కలను నెరవేర్చాం’’ అంటూ సంస్థ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు.



ఇప్పటివరకు సుమారు 1.5 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 40 ప్రాజెక్టులను పూర్తి చేశామని, ఇంకో కోటి చ.అ. విస్తీర్ణంలో ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని తెలియజేశారు. వచ్చే ఐదేళ్లలో ఏపీ, తెలంగాణ, బెంగళూరుల్లో 3-4 కోట్ల చ.అ.ల్లో భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ‘‘శిక్షణ పొందిన నిపుణుల కొరత ప్రస్తుతం నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. కానీ ఈ విషయంలో మాకైతే ఎలాంటి ఇబ్బందీలేదు. మా సంస్థలో ప్రత్యక్షంగా 1,200 మంది ఉద్యోగులు, 6,000 మంది రోజువారీ కూలీలు ఉపాధి పొందుతున్నారు. వీరంతా సుశిక్షితులే. అందుకే గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేసి కొనుగోలుదారులకు అందించగలుగుతున్నాం. ఇదే మా విజయ రహస్యం’’ అని ప్రసాద్ వివరించారు.



గ్రీన్ బిల్డింగ్స్‌కు ఆదరణ: రాజన్న

ఐదేళ్లుగా దేశంలో హరిత భవనాల సంఖ్య పెరుగుతూ వస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)-తెలంగాణ వైస్ చైర్మన్ వి.రాజన్న చెప్పారు. కొనుగోలుదారుల్లోనూ వీటిపై అవగాహన పెరిగిందన్నారు. ‘‘హరిత భవనాల విషయంలో ప్రపంచంలో మనది రెండో స్థానం. ప్రస్తుతం దేశంలో 360 కోట్ల చ.అ. విస్తీర్ణంలో సుమారు 3,600 ప్రాజెక్టులు ఐజీబీసీ గుర్తింపు పొందాయి. 2022 నాటికల్లా ఇది 1,000 కోట్ల చ.అ.కు చేరుతుంది. దాంతో ప్రపంచంలో నంబర్‌వన్ స్థానానికి చేరతాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. సాధారణ నిర్మాణాలతో పోలిస్తే హరిత భవనాల నిర్మాణానికి 3-5 శాతం మాత్రమే ఎక్కువ వ్యయం అవుతుందని సీఐఐ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రఘుపతి చెప్పారు. కరెంటు, నీటి బిల్లులు తదితరాల్లో తగ్గుదల ద్వారా ఈ వ్యయం రెండేళ్లలో తిరిగొస్తుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఐజీబీసీకి 20 చాప్టర్లున్నాయని.. ఈ సంవత్సరాంతానికి మరో 20 చాప్టర్లను ప్రారంభించనున్నామని చెప్పారు. కార్యక్రమంలో అపర్ణా వైస్ ప్రెసిడెంట్ కేవీకే రాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కటి

నాలుగేళ్లుగా దేశంలో అపార్ట్‌మెంట్ల విభాగంలో ప్లాటినం రే టింగ్ పొందిన ప్రాజెక్టులు ఏడే. వాటిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ గుర్తింపు దక్కింది ఒక్క అపర్ణా సరోవర్ గ్రాండ్ ప్రాజెక్టుకే. ప్రాజెక్టు నిర్మాణం కోసం స్థలం ఎంపిక నుంచి, ప్లానింగ్, నీరు, విద్యుత్ పునర్వినియోగం, నిర్మాణ సామగ్రి వాడకం, ఇండోర్, ఔట్‌డోర్ వసతుల వంటి ప్రతి విభాగంలోనూ ఐజీబీసీ సభ్యులు  క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మరీ ఈ గుర్తింపునిస్తారు. మొత్తం వంద మార్కులకు గాను సరోవర్‌కు 81 మార్కులొచ్చాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top