ఆహ్లాదం చాటున అసాంఘికం

Anti Social Activites In Visakhapatnam Sea Parks - Sakshi

సాక్షి, పరవాడ: ఆహ్లాదాన్ని పంచే పార్కులు అసాంఘి క కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నా యి. తీర ప్రాంతాల్లోని పార్కుల్లో నిత్యం మందు‘పార్టీలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వచ్చే పర్యాటకులు, సందర్శకులు నానా అవస్థలు పడుతున్నారు. ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్కులు అధ్వానంగా తయారయ్యాయి.

తీరంలో సేద దీరడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సీ వాటర్‌ పార్కు, మినీ పార్కుల దుస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇక్కడ పార్కులకు విశాఖ స్టీల్‌ ప్లాంటు, గాజువాక, అగనంపూడి, సబ్బవరం, అనకాపల్లి, పరవాడ, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల నుంచి ప్రతీ ఆదివారం, సెలవు దినాల్లో పర్యాటకులు నిత్యం అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

వేసవి సెలవుల్లో నిత్యం విద్యార్థులతో తీర ప్రాంతాలతో పాటు పార్కులు కళకళలాడుతుంటా యి. అయితే కొందరు ఆకతాయిల వల్ల ఇవి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే యువకులు పుట్టిన రోజు, పెళ్లి రోజు పేరుతో నిత్యం మందు పార్టీలు చేసుకుంటున్నారు.

పర్యాటకానికి దెబ్బ...

తాగిన మద్యం సీసాలు, ఆకులు, ప్లేట్లు, డ్రింకు బాటిళ్లు, సిగరెట్లు తదితర వస్తువులను ఎక్కడపడితే అక్కడే వదిలేస్తున్నారు. కొందరు ఆకతాయిలు ఖాళీ మద్యం సీసాలను చితక్కొట్టి విసేరేస్తున్నారు. చితికిన గాజు పెంకులు ఇసుకలో కూరుకుపోయి ఉంటున్నాయి. బీచ్‌లకు వస్తున్న పర్యాటకులు ఆట పాటలతో సరదాగా గడుపుతున్న సమయంలో ఇసుకలో ఉన్న గాజుపెంకులు కాళ్లకు గుచ్చుకొని తీవ్రంగా గాయపడుతున్న సంఘటనలు అనేకం. తిక్కవానిపాలెం తీరంలో ఎన్టీపీసీ జెట్టీ వద్ద ఏర్పాటు చేసిన సీ వాటర్‌ పార్కును ఆకతాయిలు పాల్పడుతున్న ఆసాంఘిక కార్యకలాపాల వల్ల పార్కు లోపటికి సందర్శకులను అనుమతించడం మానేశారు.

ఇక్కడి మినీ పార్కును ఆకతాయిలు ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారు. పార్కులో నిర్మించిన గొడుగుల కింద కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ఆ తరువాత ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలు, గాజు పెంకులు పడేస్తూ వెళ్లిపోతున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన చెత్తకుండీని కూడా ఉపయోగించడం లేదు. ఆదివారమైతే అధిక సంఖ్యలో యువకులు తరలివచ్చి ఇక్కడి సరుగుడు, జీడి మామిడి తోటల్లో జూదం ఆడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తీరంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ పికెట్లను ఎత్తివేయడంతో ఆకతాయిలకు ఆగడాలకు అడ్డూ అదుపులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top