గుంటూరు పరిసరాల్లో హైకోర్టు!

గుంటూరు, మంగళగిరి మధ్య భూములు - Sakshi


* నగర శివారు, మంగళగిరి ప్రాంతాల్లో భూములపై ఆరా

* ఒకేచోట అన్ని కోర్టులు, క్వార్టర్లు నిర్మించే యోచన

* 150-200 ఎకరాలు కావాలంటున్న హైకోర్టు వర్గాలు

* భూమి ఎంపిక తర్వాత చీఫ్ జస్టిస్ పరిశీలించే అవకాశం

 

సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ పరిసరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, హైకోర్టును గుంటూరు పరిసరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు పరిసరాల్లో ఏపీ హైకోర్టు ఏర్పాటు కోసం 150 నుంచి 200 ఎకరాల స్థలం కావాలని హైకోర్టు వర్గాలు ప్రభుత్వాధికారులను కోరినట్లు సమాచారం. దీంతో అధికారులు హైకోర్టు ఏర్పాటునకు అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నారు.గుంటూరు నగరంలో అంత స్థలం దొరికే అవకాశం లేకపోవడంతో నగర శివారు ప్రాంతాలు, నాగార్జున యూనివర్సిటీ పరిసరాల్లోని భూములను పరిశీలిస్తున్నారు. మంగళగిరి, తుళ్లూరు ప్రాంతంలోని కృష్ణా నది వెంబడి ఉన్న భూము లు హైకోర్టు ఏర్పాటుకు అనుకూలమా..? కాదా..? అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. విశాలమైన భవనాలతో హైకోర్టు ఏర్పాటు, అక్కడే న్యాయమూర్తుల క్వార్టర్లు, న్యాయాధికారుల క్వార్టర్లు, మిగిలిన న్యాయస్థానాల ఏర్పాటు తదితరాలన్నీ కూడా ఒకేచోట కేంద్రీకృతం చేయాలనే ఆలోచన చాలా రోజుల నుంచి హైకోర్టు న్యాయమూర్తుల మదిలో ఉంది. దీనివల్ల కక్షిదారులతో పాటు న్యాయవాదులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదనేది న్యాయమూర్తుల ఆలోచన.రాష్ట్రం విడిపోకముందు కూడా ఇటువంటి ప్రయత్నమే జరిగింది. రంగారెడ్డి జిల్లా, బుద్వేల్ సమీపంలో 100 ఎకరాల స్థలాన్ని హైకోర్టు న్యాయమూర్తులు స్వయంగా పరిశీలించి ఖరారు చేశారు. అయితే కొన్ని కారణాలవల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి హైకోర్టును భారీస్థాయిలో నిర్మించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే 150 నుంచి 200 ఎకరాలు కోరినట్లు సమాచారం.గుంటూరు, మంగళగిరి పరిసరాల్లో 3 ప్రాంతాలను గుర్తించాక, అందు కు సంబంధించిన పూర్తి వివరాలతో రెవెన్యూ అధికారులు ఓ నివేదిక తయారు చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపుతారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ నివేదికపై ఫుల్‌కోర్ట్ సమావేశంలో తన సహచర న్యాయమూర్తులతో చర్చించిన తరువాత ఏ ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మధ్యలోనే ప్రభుత్వం ఎంపిక చేసే మూడు ప్రాంతాలను న్యాయమూర్తులు స్వయంగా పరిశీలించే అవకాశం ఉంది.

 

గుంటూరులోనే ఎందుకు?

హైకోర్టును గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలనుకోవడం వెనుక పలు చారిత్రక కారణాలున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఏపీ రాజధానిగా కర్నూలు ఉన్నప్పుడు గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గుంటూరులో కలెక్టరేట్ ఉన్న ప్రాంతంలోనే హైకోర్టు ఉండేది. 1956లో రాజధానిని హైదరాబాద్‌కు తరలించినప్పుడు హైకోర్టును కూడా అక్కడకు మార్చారు.హైకోర్టును అక్కడకు తరలించే సమయంలో గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని పెద్ద మనుషుల మధ్య ఒప్పందం  జరిగింది. కానీ అది అమలు కాలేదు. అనంతరం గుంటూరులో హైకోర్టులో బెంచ్ ఏర్పాటు గురించి ఉద్యమాలు జరిగాయి. మూడేళ్ల కిందట కూడా బెంచ్ ఏర్పాటుకోసం భారీ ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైకోర్టును గుంటూరులోనే ఏర్పాటు చేయాలనే వాదనపై హైకోర్టు వర్గాల్లోనే సానుకూలత ఉందనే ప్రచారం జరుగుతోంది.మరోవైపు రాజధాని ఎంపిక కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ హైకోర్టును విశాఖపట్టణంలో ఏర్పాటు చేసి, బెంచ్‌ను రాయలసీమలో పెట్టాలని తన నివేదికలో సూచించింది. బెంచ్ ఏర్పాటు విషయంలో గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే, ఎన్నడూ కూడా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు.మరోవైపు విశాఖపట్టణంలో హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమ వాసులకు దూరం సమస్యగా మారొచ్చు. అందువల్ల గుంటూరులో ఏర్పా టు చేస్తే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రజలకు మధ్యలో ఉంటుంది కాబ ట్టి, ఎటువంటి సమస్యలు ఉండవనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అందుబాటులో ఉన్న భూములను బట్టి దీనిపై నిర్ణయం జరిగే అవకాశం ఉంది. స్థలాన్ని ఎంపిక చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికను కేంద్ర న్యాయ శాఖ అనుమతి కోసం పంపే అవకాశం ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top