‘56 ఏళ్ల తర్వాత ఏపీకి హై కోర్టు’

Andhra Pradesh High Court Chief Justice Praveen Kumar Said After 56 Years Andhra Pradesh Get Separate High Court - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్‌ జస్టిస్‌తో సహ 13మంది న్యాయమూర్తులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. చరిత్రను తిరగరాయడానికి ఇది మంచి సందర్భం అని కొనియాడారు. సమయం తక్కువగా ఉన్నప్పటికి.. వసతులు పూర్తిగా లేనప్పటికి ఎలాంటి లోటు లేకుండా హై కోర్టు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టును దేశంలోనే అత్యున్నత హై కోర్టుగా తీర్చిదిద్దుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణం కోసం రైతులు 33 వేల ఎకరాల భూమి ఇచ్చారని ప్రశంసించారు. హైకోర్టు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని హామి ఇచ్చారు.

56 ఏళ్ల తర్వాత ఏపీకి హైకోర్టు : ప్రవీణ్‌ కుమార్‌
ఏపీకి ప్రత్యేక హై కోర్టు రావడం ఓ చారిత్రక ఘట్టమంటూ ఆంధ్ర ప్రదేశ్‌ హై కోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌ కుమార్‌ ప్రశంసించారు. 56 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ నుంచి ఏపీకి హైకోర్టు వచ్చిందని తెలిపారు. అందరి సమన్వయంతో హై కోర్ట్‌ నిర్వహణను ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. కొత్త చరిత్రను ఇక్కడి నుంచి మొదలు పెడదామని కోరారు. ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు.

సుప్రీం కోర్టు ప్రారంభానికి సీజే వస్తారు : ఎన్వీ రమణ
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ మాట్లాడుతూ.. జనవరి 25 నాటికి హై కోర్టు బిల్డింగ్‌ పూర్తి అవుతుందని సీఎం చెప్పారన్నారు. హై కోర్టు ప్రారంభోత్సవానికి రావడానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సన్నద్దంగా ఉన్నారని తెలిపారు. ఇన్‌చార్జి చీఫ్‌ జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఏపీ హైకోర్టు మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఏపీ హైకోర్టు దేశంలోనే ఉత్తమ హై కోర్టుగా గుర్తింపు పొందాలని ఎన్వీ రమణ కోరుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top