అగ్రిగోల్డ్‌ ఆస్తులు రూ.3,861 కోట్లు

Agrigold Properties Value is 3,861 crores - Sakshi

వివరాలు హైకోర్టుకు ఇచ్చాం.. ఆదేశిస్తే వేలం వేస్తాం

మీడియా సమావేశంలో సీఐడీ ఎస్పీ ఉదయ్‌భాస్కర్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్‌ ధరల ఆధారంగా రూ.3,861 కోట్ల 76 లక్షలని సీఐడీ ఎస్పీ ఉదయ్‌భాస్కర్‌ వెల్లడించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల వ్యవహారంలోను, డిపాజిటర్లకు న్యాయం చేయడంలోను రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అగ్రిగోల్డ్‌ మొత్తం ఆస్తుల వివరాలు హైకోర్టుకు సమర్పించామన్నారు. వాటిలో 366 ఆస్తులకు సంబంధించి వేలానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అందులో కొన్నిటిని ఇప్పటికే రూ.47 కోట్లకు వేలం వేశామన్నారు. మిగిలిన అన్ని ఆస్తులను హైకోర్టు ఆదేశాలు ఇవ్వగానే వేలం వేస్తామన్నారు. మూడు బ్యాంకుల్లో రూ.428 కోట్లకు హాయ్‌ల్యాండ్‌ మార్టిగేజ్‌ చేశారని, స్టేట్‌బ్యాంక్‌ ద్వారా రూ.95 కోట్లు ఇచ్చారని తెలిపారు. హాయ్‌ల్యాండ్‌ వేలానికి ఎస్‌బీఐకి హైకోర్టు అనుమతి ఇచ్చిందని, వేలం అనంతరం వివరాలు తమకు తెలిపి తుది అనుమతి తీసుకోవాలని ఆదేశించినట్టు ఉదయ్‌భాస్కర్‌ చెప్పారు.

అగ్రిగోల్డ్‌ సంస్థకు సంబంధించిన మోసాలపై మొత్తం 29 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఏపీలో 15 కేసులు, తెలంగాణాలో 3, కర్ణాటకలో 9, అండమాన్‌ నికోబర్, ఒడిశాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయని చెప్పారు. ఎండీ అవ్వా వెంకటరామారావుతోపాటు డైరెక్టర్లను అరెస్టు చేసి జ్యూడీషీయల్‌ కస్టడీకి పంపించామన్నారు. మొత్తం 19,18,865 డిపాజిటర్ల (32,02,632ఖాతాలు)లో ఏపీకి చెందిన 11,57,497 మంది(19,43,121ఖాతాలు) ఉన్నారన్నారు. మొత్తం రూ.6,380 కోట్ల 31 లక్షల డిపాజిట్లలో ఏపీకి చెందిన రూ.3,944 కోట్ల 70 లక్షల డిపాజిట్లు ఉన్నాయన్నారు. చనిపోయిన అగ్రిగోల్డ్‌ బాధితులకు చెందిన కుటుంబాలలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.7 కోట్లు పరిహారం అందించినట్టు చెప్పారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల గుర్తింపు, వేలం, డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు బాధ్యతలు చూస్తున్న సీఐడీ జిల్లా వారీగా కమిటీలు వేసినట్టు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top