రేపు కేరళలోకి నైరుతి! | Sakshi
Sakshi News home page

రేపు కేరళలోకి నైరుతి!

Published Sun, May 31 2020 4:47 AM

Actively moving Monsoons - Sakshi

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: నైరుతి రుతు పవనాలు తీరం వైపు చురుగ్గా కదులుతున్నాయి. ఇవి జూన్‌ 1న కేరళలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం ప్రకటించింది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమెరిన్‌ ప్రాంతాలు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరిస్తున్నాయి. రాగల 36 గంటల్లో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో జూన్‌ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ. ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 0.9 కి.మీ. ఎత్తులో తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్‌ కర్ణాటక, కేరళ పరిసరాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. 

► దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన  తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  
► ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో మూడు రోజులపాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయి.
► రాయలసీమలో ఒకట్రెండు చోట్ల 41 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 
► గడచిన 24 గంటల్లో సి.బెలగలో 10 సెం.మీ., పత్తికొండలో 6, బలిజపేట, హోలగుండలో 5, గరివిడి, మెరకముడిదాం, తెర్లాం, గూడూరు, డోన్‌లో 4 సెం.మీ., బొబ్బిలి, పాలకొండ, చీపురుపల్లి, మందస, భీమిలి, గరుగుబిల్లి, బనగానపల్లి, రామగిరి, ఓక్, ఆరోగ్యవరంలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
► తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని అమలాపురం, అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
► రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలో అక్కడక్కడా జల్లులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.

తండ్రీ బిడ్డల్ని కబళించిన పిడుగులు
పిడుగులు పడి తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందిన దుర్ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణిలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కృష్ణప్ప (50) వ్యవసాయం చేస్తూ.. పొలంలోనే పశువుల్ని పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం పాలు పితికేందుకు ఇద్దరు కుమార్తెలు రమాదేవి (24), మీనా (22)తో కలసి పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. వర్షం తగ్గినా ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో కృష్ణప్ప భార్య గ్రామస్తులతో కలసి పొలం వద్దకు వెళ్లి చూడగా.. ముగ్గురూ విగతజీవులై పడి ఉన్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement
Advertisement