చురుగ్గా సాగునీటి ప్రాజెక్టుల పనులు | Sakshi
Sakshi News home page

చురుగ్గా సాగునీటి ప్రాజెక్టుల పనులు

Published Sun, Aug 9 2015 12:46 AM

Active irrigation projects in the works

భీమడోలు : రాష్ర్టంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి వెళుతూ శనివారం భీమడోలులోని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇంటి వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు  491 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి వదిలేశామన్నారు. రాష్ర్టంలో 47.8 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించున్నామని చెప్పారు. సగటున రోజుకు 2 నుంచి 3 టీఎంసీల గోదావరి నీరు వృథాగా పోతోందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలనేది పోలవరం, పట్టిసీమ ప్రొజెక్టుల నిర్మాణం ప్రధాన ఉద్దేశమన్నారు.
 
 గోదావరి వరద నీటిని కృష్ణా ఆయకుట్టుకు మళ్లించి, ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే కృష్ణా వరదనీటిని శ్రీశైలం, హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రొజెక్టుల ద్వారా రాయలసీమకు మళ్లిస్తామన్నారు. దీనిద్వారా కొంతమేరైనా సాగు, తాగునీటి సమస్య తీరుతుందన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు పూర్తి స్థాయిలో తాగు, సాగు నీటి అవసరాలు తీరిన తర్వాతే కృష్ణా ఆయుకట్టుకు నీటిని మళ్లిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు, కంట్రాక్టర్ల సమన్వయంతో పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ కె.భాస్కర్, ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉన్నారు.
 
 ఆయిల్ పైపులైన్ నిర్మాణం పరిశీలన
 దేవరపల్లి(గోపాలపురం): గోపాలపురం మండలం భీమోలు వద్ద జరుగుతున్న గెయిల్, హెచ్‌పీసీఎల్ ఆయిల్ పైపులైన్ నిర్మాణ పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం పరిశీలించారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు సుమారు 15 ఏళ్ల క్రితం ఆయిల్ పైపులైన్లు ఏర్పాటు చేసి ఆయిల్‌ను పంపింగ్ చేస్తున్నారు. పైపులైన్ పోలవరం కాలువ తవ్వకానికి అడ్డుగా ఉండటం వల్ల ఇటీవల తొలగించి కాలువ అడుగుభాగం నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను మంత్రి  పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భీమోలు నుంచి గోపాలపురం వరకు సుమారు 3 కిలోమీటర్ల పైపులైను వేస్తున్నారు. మంత్రి వెంట కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.
 

Advertisement
Advertisement