సుప్రీంకోర్టు తీర్పుతో పాలమూరు, డిండి,సీతమ్మసాగర్‌కు అనుమతులు నిలిపేసిన కేంద్రం
పాలమూరుకు అనుమతుల కోసం 2023లోనే నిపుణుల మదింపు కమిటీ షరతులతో సిఫారసు
షరతుల అమల్లో జాప్యం కారణంగా రెండేళ్లపాటు అనుమతులు జారీ చేయని కేంద్రం
ఆలోగా సుప్రీం తీర్పు రావడంతో వచ్చినట్లే వచ్చి నిలిచిపోయిన అనుమతులు
సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు సైతం ఇక అనుమతులు అనుమానమే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ అనుమతులు (ఈసీ) తీసుకోకుండా చట్టవిరుద్ధంగా నిర్మితమవుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఆ తర్వాత దశ (పోస్ట్ ఫ్యాక్టో)లో పర్యావరణ అనుమతులు ఇచ్చేలా కేంద్రం 2017, 2021లలో జారీ చేసిన నోటిఫికేషన్, మెమోరాండంను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు తెలంగాణకు శరాఘాతంగా మారింది. పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి తదితర ప్రాజెక్టులకు భవిష్యత్తులో అనుమతులు పొందేందుకు ఉన్న దారులను మూసేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీని నిలుపుదల చేసింది.
‘పాలమూరు’కు ముందడుగు పడ్డట్టే పడి..
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ 2023 జూలై 24న సమావేశమై పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. ఈఏసీ సిఫారసు చేస్తే అనుమతి రావడం లాంఛనమే. అయితే పర్యావరణ అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టు పనులను చేపట్టినందుకు ప్రాజెక్టును ప్రతిపాదించిన అధికారి (ప్రాజెక్టు ప్రపోనెంట్)పై పర్యావరణ పరిరక్షణ చట్టం–1986లోని సెక్షన్ 19 కింద రాష్ట్ర ప్రభుత్వం/కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ అప్పట్లో షరతు విధించింది.
పర్యావరణ అనుమతుల జారీకి ముందు ఆ వివరాలను సమర్పించాలని సూచించింది. అనుమతులు జారీ చేసే వరకు ప్రాజెక్టు నిర్వహణ చేపట్టరాదని స్పష్టం చేసింది. దీంతో కొందరు అధికారులపై స్థానిక కోర్టులో కేసు పెట్టి ఆ వివరాలను కేంద్ర పర్యావరణ శాఖకు నీటిపారుదల శాఖ పంపించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సంతృప్తి చెందని పర్యావరణ శాఖ.. అనుమతులు జారీ చేయకుండా అదనపు సమాచారం కోరింది. ఆలోగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ఈ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను కేంద్రం పక్కనపెట్టేసిందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం.. పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్ 2006ను ఉల్లంఘించినట్లు గతంలోనే నిపుణుల మదింపు కమిటీ నిర్ధారించింది. ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీకి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్‌ఓపీ)ను ప్రకటిస్తూ 2021లో కేంద్రం ఆఫీస్ మెమోరండం జారీ చేసింది. పర్యావరణ పునరుద్ధరణకు రూ. 72.63 కోట్లు, ప్రకృతి వనరుల వృద్ధికి రూ. 40.2 కోట్లు, సామాజిక వనరుల అభివృద్ధికి రూ. 40.8 కోట్లు కలిపి మొత్తం రూ. 153.7 కోట్లతో ఎస్‌ఓపీ అమలు చేస్తామని నీటిపారుదల శాఖ ప్రతిపాదించగా నిపుణుల కమిటీ గతంలో సమ్మతి తెలిపింది.
అనుమతులు లేకుండానే రూ. 21,200 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు పనులు చేపట్టినందున నిబంధనల ప్రకారం అందులో 0.5 శాతం చొప్పున రూ. 106 కోట్లను జరిమానాగా విధించింది. అయితే ఎస్‌ఓపీని ప్రకటిస్తూ కేంద్రం జారీ చేసిన ఆఫీస్ మెమోరండంను సైతం సుప్రీంకోర్టు కొట్టేయడంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇక అనుమతులు లభించడం అసాధ్యంగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
పర్యావరణ అనుమతులు లేకుండా 90 శాతం ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసినందుకు గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 528 కోట్ల జరిమానా విధించి పర్యావరణ పరిహారంగా కృష్ణా బోర్డుకు చెల్లించాలని ఆదేశించగా సుప్రీంకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్టే తెచ్చుకుంది. రూ. 32,500 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టగా ఆ తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ. 55 వేల కోట్లకు పెరిగింది. ఇప్పటికే రూ. 35 వేల కోట్లకుపైగా వ్యయంతో పనులు జరిగాయి.
‘సీతమ్మసాగర్’దీ అదే పరిస్థితి..
పర్యావరణ అనుమతులు లేకుండానే రూ. 19,954 కోట్ల అంచనాతో నిర్మితమవుతున్న సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు పరిస్థితి సైతం అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం రాష్ట్రం చేసుకున్న దరఖాస్తును సుప్రీం తీర్పు తర్వాత కేంద్రం మూసేసిందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే రూ. 11,316 కోట్లతో పనులు చేసిన ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నుంచి మాత్రం అన్ని రకాల అనుమతులు లభించాయి. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేసినందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్జీటీ రూ. 53 కోట్ల జరిమానా విధించింది. మరోవైపు పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు మొదలుపెట్టినందుకు డిండి ప్రాజెక్టుకు ఎన్జీటీ గతంలో రూ. 92.5 కోట్ల మేర జరిమానా విధించింది.


