సంచలనం కలిగించిన యానాం సబ్ జైలుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారిగా భావిస్తున్న అశ్విన్, శిలంబులను విచారణ
పోలీసు కస్టడీకి నిందితులు
Oct 1 2013 2:17 AM | Updated on Aug 21 2018 5:44 PM
యానాం టౌన్, న్యూస్‌లైన్ :సంచలనం కలిగించిన యానాం సబ్ జైలుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారిగా భావిస్తున్న అశ్విన్, శిలంబులను విచారణ కోసం ఒకరోజు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ యానాం సబ్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవల పోలీసులు వీరిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ప్రస్తుతం పుదుచ్చేరిలోని కాలాపేట కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే అశ్విన్, శిలంబులను విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని యానాం పోలీసులు కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పుదుచ్చేరిలోని కాలాపేట కేంద్ర కారాగారం నుంచి బాంబు స్క్వాడ్ వాహనంలో నిందితులను యానాంకు తరలించారు.
అనంతరం యానాం సబ్ కోర్టులో నిందితులను హాజరుపరిచారు. నిందితులను ఒకరోజు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చినట్టు ఎస్సై షణ్ముగం తెలిపారు. ఆగస్టు 29న యానాం సబ్‌జైలులోకి చొరబడి, జైల్లో ఉన్న ఓ జీవిత ఖైదీని హతమార్చడానికి నిందితులు యత్నించారు. పోలీసులు అప్రమత్తం కావడంతో వారి పథకం నెరవేరలేదు. యానాం పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే 13 మందిని పట్టుకున్నారు. వీరికి యానాం కోర్టు రిమాండ్ విధించగా, కాలాపేట కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ సమయంలోనే అశ్విన్, శిలంబులు తప్పించుకున్నారు. కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చిన అనంతరం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Advertisement
Advertisement