విద్యాసంస్థలు బంద్‌ : ఏబీవీపీ ఆందోళనలు

సాక్షి, హైదరాబాద్‌ : కార్పొరేట్‌ కళాశాల్లో అభ్యసిస్తున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో అఖిల భారత విద్యా పరిషత్‌(ఏబీవీపీ) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఇంత జరుగుతున్నా ఇంటర్‌ బోర్డు అధికారులు, ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయాలుగా నిలుస్తున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలను వెంటనే మూసేయాలని డిమాండ్‌ చేశారు. బ్రాండ్‌ పేరుతో వందల కోట్ల వ్యాపారం చేస్తున్న నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో వందల మంది విద్యార్థులు ఉసురు తీసుకున్నా ఒక్క అరెస్టు కూడా జరగలేదని చెప్పారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బంద్‌:

  • విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఏబీవీపీ నాయకులు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నారాయణ, చైతన్య కాలేజీల ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.  
  • విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో బంద్‌ కారణంగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్‌ కాలేజీలు మూతపడ్డాయి. కడపలో వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం బైక్‌ ర్యాలీ నిర్వహించింది. కోటిరెడ్డి సర్కింల్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌లలో ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూలు ఆందోళన నిర్వహించాయి. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావులను బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి.
  • బంద్‌ నేపథ్యంలో అనంతపురం నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజీ వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థి నేతలు చేరుకోవడంతో పోలీసులు వారిని ఈడ్చుకెళ్లారు. విజయవాడలోని బెంజ్‌సర్కిల్‌ వద్ద విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశాయి.
  • విద్యార్థుల ఆత్మహత్యపై నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. కార్పొరేటు కళాశాలల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, డీజీపీ, అధికారులు పాల్గొననున్నారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top