సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నిత్యనూతనమై ప్రజ్వరిల్లుతోంది. 60వ రోజైన శనివారం కూడా ‘పశ్చిమ’ వాసులు గర్జనలు
60వ రోజైన ‘పశ్చిమ’జనోద్యమం
Sep 29 2013 2:59 AM | Updated on Sep 1 2017 11:08 PM
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నిత్యనూతనమై ప్రజ్వరిల్లుతోంది. 60వ రోజైన శనివారం కూడా ‘పశ్చిమ’ వాసులు గర్జనలు, వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించి విభజన నిర్ణయంపై కన్నెర్ర చేశారు. వినూత్న ఆందోళనలు, కేంద్ర పాలకులు మనసులు మార్చాలంటూ గర్జనలు, పాదయాత్రలు, జన జాగారం వంటి కార్యక్రమాలతో ఉద్యమస్ఫూర్తిని ఉరకలెత్తించారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరు ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర కార్యాల యాల ముట్టడిలో భాగంగా రెండో రోజు టెలికం, బ్యాం కులు, పోస్టల్ శాఖ కార్యకలాపాలను ఎన్జీవోలు స్తంభింప చేశారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో పశు సంవర్థకశాఖ, ఏపీఎస్‌ఐడీసీ ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గురుశిష్య సమైక్య భేరి నిర్వహించి సమైక్య నినాదాలు చేశారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమంలో మమేకమయ్యారు.
గజల్ శ్రీనివాస్ ‘ఓయి తెలుగువాడా...మనకి దే వెలుగువాడ...’ అంటూ ఉద్యమ స్ఫూర్తిని రగలించేలా గజల్స్‌ను ఆలపించారు. చిన్నారులు దేశభక్తి గీతాలకు అనుగుణంగా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. భీమవరంలో ఉపాధ్యాయులు వెనక్కినడిచి నిరసన తెలిపారు. జీవీఐటీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ రహదారిని దిగ్భందించి సమైక్యనాదం చేశారు. ఉద్యమం 60 రోజులు నిండిన సందర్భంగా 60 అంకె ఆకారం లో నిలబడి విద్యార్థులు, అధ్యాపకులు తమ దీక్షను ఎవరూ భగ్నం చేయాలేరని చాటిచెప్పారు. ఉండిలో గొడుగులతో ఉపాధ్యాయులు, ఎన్జీవోలు నిరసన తెలిపారు. యండగండిలో రాస్తారోకో చేశారు. కాళ్లలో సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సర్రాజు పాదయాత్ర నిర్వహించారు. బొండాడ గ్రామం నుంచి కాళ్లకూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు సుమారు 12 కిలోమీటర్లు పాదయాత్రలో వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.
కేంద్రంలోని పెద్దల మనస్సులను మార్చాలని వెంకన్నకు నాయకులు పూజలు నిర్వహించి వేడుకున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా జన జాగారాన్ని తాడేపల్లిగూడెంలో శని వారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకూ సమైక్యాంధ్ర ఆవశ్యకత తెలిపే కళారూపాలను ప్రదర్శించారు. పాలకొల్లు రైతు వేదిక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ నిమ్మల రామానాయుడు నేతృత్వంలో రాష్ట్రం విడిపోతే అందరికి అన్నం పెట్టే అన్నదాతకూ అన్నం కరువే అంటూ ఏర్పాటు చేసిన ప్రదర్శన పలువురిని ఆలోచింపజేసింది. ఎన్‌జీవోల సంఘం ఆధ్వర్యంలో నరసాపురం ఆర్డీవో వసంతరావు తహసిల్దార్ కార్యాలయం వద్ద గ్రామ సహయకులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ఉద్యమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుదిరగవద్దని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేశారు. పోడూరు మండలంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ చేశారు. చాగల్లులో రిలే దీక్షలో ఫొటోగ్రాఫర్లు పాల్గొని మద్దతు తెలిపారు. ఆర్‌అండ్ బీ రోడ్డుపై తెలంగాణ- సీమాంధ్ర జట్లుగా ఏర్పడి కబడ్డీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో సీమాంధ్ర జట్టు గెలిచింది. తెలంగాణ నాయకుల ఆటలు ఎంతోకాలం సాగవని ఆటగాళ్లు సమైక్య శపథం చేశారు. తాళ్లపూడి బజారు సెంటరులో ఎన్జీవో లు రోడ్లను ఊడ్చి తెలంగాణ నాయకులకు పట్టిన దుమ్ము వదలగొడతామని ప్రతిజ్ఞ చేశారు. బుట్టాయగూడెంలో బూసరాజు పల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డుపై బైటాయించారు. అధ్యాపకులు, సిబ్బంది కబడ్డీ ఆడి ఢిల్లీ పెద్దలకు దిమ్మతిరిగేలా ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు
సమైక్యాంధ్రకు మద్దతుగా కావలిపురానికి చెందిన 100 మంది రైతులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నిడదవోలులో ఉపాధ్యా య జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో ముస్లిం ఉపాధ్యాయులు 12 మంది పాల్గొన్నారు. గణపతి సెంటర్‌లో రోడ్డుపైన నమాజ్ చేసి నిరసన తెలిపారు. పెరవలి మండలం తీపర్రులో వ్యవసాయ పనులు పక్కన పెట్టి రైతులు రిలే నిరాహారదీక్షలు చేశారు. నర్సాపురం బస్టాం డ్ సెంటర్‌లో 20 మంది కరాటే విద్యార్థులు విన్యాసాలు చేశా రు. అంబేద్కర్ సెంటర్‌లో సాయిబాబా గుడిలోని ఉత్సవమూర్తిని సమైక్యాంధ్రకు మద్దతుగా ఊరేగించారు. స్వామికి పాలాభిషేకం చేశారు.
Advertisement
Advertisement