సమస్యలు పరిష్కారం కావడం లేదు

120 Applications To SP Grievence  - Sakshi

కలెక్టర్‌కి ఎస్సీ, ఎస్టీల వినతి

ప్రత్యేక గ్రీవెన్స్‌కు 120 అర్జీలు

అనంతపురం అర్బన్‌: దళితులు, గిరిజనుల సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ అధికారుల ఎదుట ఆ వర్గాల నాయకులు, ప్రజలు వాపోయారు. పలుమార్లు తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోందని వాపోయారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌ జరిగింది. ప్రజల నుంచి కలెక్టర్‌ జి.వీరపాండియన్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి, జేసీ–2 హెచ్‌.సుబ్బరాజు, డీఆర్‌ఓ ఎస్‌.రఘునాథ్‌ అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్‌కు వివిధ సమస్యలపై 120 అర్జీలు వచ్చాయి.

కొన్ని సమస్యలు ఇలా...
భూమి కొనుగోలు పథకం ద్వారా సాగుభూమిని కొనుగోలు చేసి ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేయాల్సిన కార్యక్రమం జిల్లాలో అమలు కావడం లేదని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు బీసీఆర్‌దాస్, నాయకులు విన్నవించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు శ్మశాన వాటికల ఏర్పాటు స్థలం కేటాయింపు జరగడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సదరమ్‌ క్యాంప్‌ పునరుద్ధరించాలన్నారు. లిడ్‌ క్యాప్‌ ద్వారా జిల్లాలో యూనిట్‌ తెరవాలని కోరారు.

గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఈఎస్‌వెంకటేశ్, ఇతర నాయకులు విన్నవించారు. పంచాయతీ కార్మికులకు సంబంధించి 10 డిమాండ్లను జిల్లా యంత్రాంగం ముందుంచుతున్నామన్నారు. వాటిని పరిష్కరించకపోతే సమ్మెబాట పడతామన్నారు.
సబ్సిడీ రుణాల మంజూరులో కొన్ని బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కుందుర్పి ఓబయ్య, ఇతర నాయకులు ఫిర్యాదు చేశారు. 2016–17,2017–18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల ఖాతాలో జమ అయినప్పటికీ సిండికేట్, ఆంధ్రా బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదన్నారు.

ఇంటర్, డిగ్రీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనం ఏడాదికి రూ.7 వేలకు పెంచాలని ఐక్య దళిత మహానాడు రాష్ట్ర నాయకులు ఎం.సూర్యనారాయణ, జిల్లా నాయకులు తరిమెల రామాంజినేయులు, తదితరులు విన్నవించారు. హాస్టల్‌ విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం పెట్టాలన్నారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల సాగు భూమి పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top