నకిలీ పాసు పుస్తకాలతో రూ.కోటి స్వాహా | 1 crore rupees theft with fake pass books | Sakshi
Sakshi News home page

నకిలీ పాసు పుస్తకాలతో రూ.కోటి స్వాహా

Sep 11 2013 5:46 AM | Updated on Apr 4 2019 2:50 PM

నకిలీ పాసు పుస్తకాలతో రూ.లక్షలు స్వాహా చేశారు. ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి జేబులు నింపుకున్నారు.


 గొలుగొండ, న్యూస్‌లైన్: నకిలీ పాసు పుస్తకాలతో రూ.లక్షలు స్వాహా చేశారు. ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి జేబులు నింపుకున్నారు. వంద వంకలు చూపి  ఎకరా భూమికి రూ. వెయ్యి రుణమివ్వని అధికారులు నకిలీ పాసు పుస్తకాలపై పలువురికి రూ. లక్షలు చొప్పున రుణాలిచ్చేశారు. రూ.కోటి వరకు అవినీతి జరిగిందని అంచనా. నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, కోటవురట్ల మండలాల్లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. వాసిరెడ్డి మాసయ్యనాయుడుకు సెంటు భూమి లేకపోయినా నకిలీ పాసు పుస్తకాలతో నర్సీపట్నం ఆంధ్రా బ్యాంకులో రూ.లక్ష మంజూరైంది.
 
 కిల్లాడ నానాజీకి భూమి లేకపోయినా రూ.లక్ష రుణమిచ్చారు. అల్లు అప్పలనాయుడు, పైల వరహాలబాబు, భీమిరెడ్డి అప్పలనాయుడుల కు గొలుగొండ మండలంలో భూములు లేవు. వీరి పేరున ఐదు నుంచి పదెకరాలు ఉన్నట్టు నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి నర్సీపట్నం ఆంధ్రా బ్యాంకులో రుణాలు పొందారు. రాయపురెడ్డి లక్ష్మి, గంగునాయుడు, పైల సన్యాసమ్మ నర్సీపట్నం యూనియన్ బ్యాంకులో రూ.62 నుంచి రూ.92 వేల వరకు రుణాలు తీసుకున్నారు.
 సూత్రధారులెవరు?
 
 
  గొలుగొండ మండలం కొత్తపాలేనికి చెందిన పైల బాబూరావు, నర్సీపట్నం మండలం బలిఘట్టానికి చెందిన అప్పలనాయుడు, కోటవురట్ల మండలం జల్లూరుకు చెందిన సూరిబాబులు ఈ అవినీతి వ్యవహారానికి కారకులన్న వాదన వ్యక్తమవుతోంది. అసలు తమకేమీ తెలియదని, ఈ ముగ్గురూ తాము సంతకాలు పెడితే చాలని, ఎంతోకొంత ముట్టచెబుతామన్నారని పలువురు తెలిపారు. నకిలీ పాసు పుస్తకాల తయారీలో గొలుగొండ తహశీల్దార్ కార్యాలయంలోని దిగువ స్థాయి అధికారులు, నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలోని ఓ ఉద్యోగి హస్తం ఉన్నట్టు తెలిసింది. వ్యవసాయం రుణం పొందాలంటే పాసు పుస్తకాలు, అడంగల్ తప్పనిసరి. అడంగల్ కంప్యూటరీకరణ అనంతరం రుణాలు పొందడం రైతులకు కష్టతరమవుతోంది . అయినప్పటికి 2010-11 నుంచి వరుసగా మూడేళ్లపాటు నకిలీ డాక్యుమెంట్లతో భారీగా రుణాలు ఎలా మంజూరయ్యాయన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు మండలాల్లో గొలుగొండ ఎస్‌బీఐ, నర్సీపట్నం ఆధ్రా బ్యాంకు, యూనియన్ బ్యాంకుల పరిధిలో సుమారు రూ.కోటి వరకు నకిలీ పాసు పుస్తకాలపై అవినీతి జరిగినట్టు చెబుతున్నారు. రాయపురెడ్డి రాంబాబు పేరున గొలుగొండ మండలంలో ఎకరా 20 సెంట్ల భూమి మాత్రమే ఉండగా ఏడెకరాల 26 సెంట్ల భూమి ఉన్నట్టు తప్పుడు రికార్డులు సృష్టిం నర్సీపట్నంలోని ఓ బ్యాంకులో రుణం పొందినట్టు తెలిసింది.
 
 వారికెవ్వరికీ భూములు లేవు: తహశీల్దార్
 ఈ వ్యవహారంపై గొలుగొండ తహశీల్దార్ సుందరరావును వివరణ కోరగా మండలంలో వీరికి భూములే లేవని స్పష్టం చేశారు. నకిలీ పాసుస్తకాలపై యూనియన్ బ్యాంకు అధికారులను సంప్రదించగా వివరాలు వెల్లడించలేదు. ఆంధ్రా బ్యాంకు మేనేజర్ రాజును సంప్రదించగా కిల్లాడ నానాజీ, పైల వరహాలబాబు, అల్లు అప్పలనాయుడు, భీమిరెడ్డి అప్పలనాయుడుల పేరున రూ.లక్ష చొప్పున రుణాలిచ్చామని చెప్పారు. రుణాలు వెంటనే చెల్లించాలని కోరినప్పుడు పాసు పుస్తకాలు నకిలీవిగా గుర్తించామన్నారు. వెంటనే వారిని పిలిచి రుణాలు చెల్లించని పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించామని తెలిపారు. దీంతో వీరు ఈ నెల 15లోగా రుణాలు చెల్లిస్తామని, అంతవరకు విషయాన్ని గోప్యంగా ఉంచాలని కోరినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement