– IIలోu
బతుకమ్మలతో ఉద్యమం
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మహిళలు బతుకమ్మలు చేతపట్టి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ మహిళా నాయకులు అన్నారు.
ఖిలా వరంగల్: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సరిపడా వర్షాలు కురవక, చెరువులు, కుంటల్లో నీరులేక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బోర్ల ద్వారా వచ్చే కొద్దిపాటి నీటితో ఆరుతడి పంటలు వేసుకునే రైతులకు బిందు, తుంపర సేద్యం వరంగా మారనుంది. ఈ క్రమంలో యాసంగిలో తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది. బిందు, తుంపర పరికరాల ద్వారా మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు పంటకు నీరు అందుతుంది. దీంతో రెతులు బిందు, తుంపర పరికరాల (స్పింకర్ల) వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆన్ లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం..
బిందు, తుంపర్ల సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఈ ఏడాది జిల్లాలో 1,530 ఎకరాలకు గాను 589 మంది రైతులకు రూ.3.80 కోట్ల విలువైన రాయితీ పరికరాలను అందించారు. ప్రస్తుతం జిల్లాలో ఇంకా 5వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఆసక్తి గల రైతుల నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో అధికారులు ఆహ్వానిస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతో సాగు పెట్టుబడి వ్యయం తగ్గించుకొని, నాణ్యమైన పంటల దిగుబడులు సాధించగలిగే బిందు, తుంపర సేద్యాన్ని 2026 – 2027లో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తోంది.
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఎక్కువే..
జిల్లాలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు, కాల్వలు లేవు. భారీ వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా కురవలేదు. మరో వైపు భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. దీంతో వేల ఎకరాల్లో వేసిన పత్తి, జొన్న, మిరప, ఆకుకూరలు, కూరగాయల పంటలు వాడిపోతున్నాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించి, ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసే విధానాలను అవలంభించాలని రైతులకు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని బిందు, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.
రాయితీలు ఇలా..
తెలంగాణ సూక్ష్మ నీటి పారుదల పథకం (టీజీఎంఐపీ) ద్వారా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేసుకునే బీసీ సన్నకారు, చిన్నకారు రైతులకు 80శాతం రాయితీ ఇస్తుండగా, ఎస్సీ, ఎస్టీ రైతులకు 90శాతం, తుంపర్ల సేద్యం అన్ని కేటగిరీలకు 65 శాతం రాయితీపై అవసరమైన పరికరాలను అధికారులు అందిస్తున్నారు.
బిందు సేద్యంపై ఆసక్తి
నీటి ఆదాతో పాటు మొక్కకు అవసరమైన మేరకే నీటి తడులు అందించే వనరు బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్). ఇప్పటికే జిల్లాలో 2వేల మంది రైతులు బిందు సేద్యంతో పంటలు పండిస్తున్నారు. ఆయిల్‌పామ్, మిరప, వేరుశనగ, ఉద్యాన తోటలకు అవసరానికి తగ్గట్టుగా వినియోగిస్తున్నారు. ఈ సేద్యంతో నీటి ఆదాతో పాటు కలుపు నివారణ ఖర్చులు తగ్గించుకోవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రావు వివరించారు.
అన్ని డ్రిప్‌ల నుంచి ఒకేవిధంగా నీరు వస్తుందా..? లేదా..? అనేది సరిచూసుకోవాలి. అందుకోసం పొలంలోని కొలజారు, మధ్య, చివరి భాగాల్లోని డ్రిప్‌ల కింద లీటరు సామర్థ్యమున్న పాత్రలను ఉంచి నీటిని సేకరించాలి. సబ్ మెయిన్ వద్ద ఉన్న కవాటాన్ని నియంత్రించి ప్రతీ డ్రిప్ నుంచి నాలుగు లీటర్లు వచ్చే వరకు నీటిని వదలాలి. పాత్రల్లో సేకరించిన నీటిని కొలిచి వంద మీటర్ల లేటరల్ పైపుల్లో ఉన్న డ్రిప్‌ల మధ్యనీటి విడుదల 3శాతం కంటే ఎక్కువ తేడా లేకుండా చూడాలి. ఎక్కువ వ్యత్యాసం ఉంటే డ్రిప్‌లను శుభ్రం చేయడమో లేదా మార్చాలి. డ్రిప్‌లో ప్రధానంగా ఫిల్టర్లు, పైపులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. సాండ్ గ్రావెల్ ఫిల్టర్లలో కాలక్రమేణా మట్టి సేంద్రియ పదార్థాలు పేరుకుపోతాయి. దాంతో నీటి ప్రవాహం తగ్గి డ్రిప్‌లు మూసుకుపోతాయి. ఈ క్రమంలో వారానికి ఒకసారి బ్యాక్ వాష్‌లో పేరుకున్న మురికిని తొలగించాలి. పీవీసీ ప్రధాన పైపులు, సబ్ మెయిన్లు, లేటరల్ పైపుల్లో పేరుకుపోయే మట్టి, చెత్తను తీసేయాలి. ప్రతీవారం ప్లష్ వాల్ తెరిచి కొద్ది నిమిషాల పాటు నీటిని వదలాలి. నల్లని లేటరల్ చివర ఉన్న ఎండ్క్యాప్ తీసి కూడా ప్లషింగ్ చేయడంతో డ్రిప్‌లు మూసుకుపోవు. పైపులకు రంద్రాలు ఏర్పడితే గూప్ ప్లగ్‌లతో మరమ్మతులు చేయాలి. డ్రిప్‌లలో పాచి లవణాలు, కార్బోనేట్లు పేరుకుపోతే ఆమ్ల లేదా క్లోరిన్ ద్రావణంలో శుభ్రం చేయాలి. పంట కోత అనంతరం లేటరల్ పైపులను భద్రపర్చాలి.


