నియోజకవర్గాల పునర్విభజనకు మిశ్రమ ప్రాతినిధ్య విధానమే మేలు | number of seats in Rajya Sabha should be based on German parliament system: SY Qureshi | Sakshi
Sakshi News home page

నియోజకవర్గాల పునర్విభజనకు మిశ్రమ ప్రాతినిధ్య విధానమే మేలు

May 20 2026 6:03 AM | Updated on May 20 2026 6:03 AM

number of seats in Rajya Sabha should be based on German parliament system: SY Qureshi

మాట్లాడుతున్న ఎస్‌.వై. ఖురేషీ. చిత్రంలో బీవీ రాఘవులు

సమర్థ పాలన విధానంతోపాటు జనాభాకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడమే మిశ్రమ నమూనా 

రాజ్యసభలో సీట్ల సంఖ్యకు జర్మనీ పార్లమెంట్‌ వ్యవస్థను అనుసరించాలి 

దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యవహరించొద్దు 

భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్‌.వై. ఖురేషీ స్పష్టికరణ

సాక్షి, హైదరాబాద్‌: సమర్థ పరిపాలనతోపాటు జనాభాకు తగిన ప్రాధాన్యం ఇస్తూ మిశ్రమ ప్రాతినిధ్య విధానం ద్వారా దేశంలో నియోజకవర్గాల పునర్వీభజన చేపట్టడం ద్వారా ఉత్తర, దక్షిణ భారతాల మధ్య విద్వేష రహిత సామరస్యాన్ని సాధించొచ్చని భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి డాక్టర్‌ ఎస్‌.వై. ఖురేషీ అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్‌ ఖురేషీ ‘ప్రతిపాదిత పునర్వ్యవస్థీరణ–దక్షిణాది రాష్ట్రాల స్థితి’అనే అంశంపై సుందరయ్య 41వ స్మారక ఉపన్యాసం చేశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... 

దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలను జనాభా లెక్కన వేరు చేయలేం 
భారత పార్లమెంటరీ వ్యవస్థ నేటికీ 1971 నాటి జనగణన ఆధారంగానే కొనసాగుతుంది. 1976 నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలలో పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో మార్పు లేదు. పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని జనసంఖ్యతో ముడిపెడితే జనాభా నియంత్రణ లక్ష్యాలను పాటించిన రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరుగుతుందని దేశం గుర్తించింది. అందుకే 1976లో ఇందిరాగాంధీ పునర్వీభజనను 2001 వరకు నిలిపివేయాలని నిర్ణయిస్తే, వాజ్‌పేయి ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 తర్వాత జరిగే జనగణన వరకు కొనసాగించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది పూర్తయ్యే జన­గణన తర్వాత చేపట్టే పునర్విభజనపై దక్షిణ, ఉత్తర రాష్ట్రాలకు సంబంధించి వివాదాలు చాలా ఉన్నాయి.

1976లో జనాభా 54 కోట్ల 80 లక్షలు ఉంటే, ప్రస్తుత జనాభా 150 కోట్లు అని, అయితే ఇప్పటికీ 1976 నాటి ప్రాతిపదికనే పార్లమెంట్‌లో ఎంపీల సంఖ్య ఉంది. సమస్య సీట్ల పెంపు విషయంలో కాదని, ఏ ప్రాతిపదికన పెంచాలన్నదే ఇక్కడ సమస్య. 1971 నుంచి జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాదిలోని తమిళనాడులో సంతానోత్పత్తి రేటు 1.8 శాతంతో జాతీయ సగటు 2.1 శాతం కన్నా తక్కువగా ఉంటే ఉత్తరప్రదేశ్‌లో నేటికీ సంతానోత్పత్తి రేటు 2.7 శాతంగా ఉంది. సీట్ల పరంగా జనాభా లెక్కన ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా, తమిళనాడులో తక్కువగా కేటాయింపులు జరపడాన్ని ఆక్షేపించడాన్ని అక్కడి ప్రజలు ఒప్పుకోరు.  

మిశ్రమ విధానం లేదా మరో 15 ఏళ్లు గడువు 
ఈ పరిస్థితుల్లో పునర్వీభజనకు సంబంధించి మూడు ప్రత్యామ్నాయాలున్నాయి.  
వివిధ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి సామర్థ్యం ఒకే స్థాయికి చేరేంత వరకు పునర్వ్యవస్థీకరణ వాయిదా వేయడం ఒక మార్గం. ఈ మేరకు పునర్వ్యవస్థీకరణను మరో పది, పదిహేనేళ్లు వాయిదా వేయగలిగితే జనాభా వ్యత్యాసాలు తగ్గుతాయి. 50 ఏళ్లనాటి జనగణన ఆధారంగా ఇప్పటి ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం సమంజసం కాదు.  

మరో విధానం దశల వారీగా పునర్వ్యవస్థీకరణ చేయడం. అంటే ఒకేసారిగా దేశమంతా పునర్వ్యవస్థీకరణ కాకుండా రెండు మూడు ఎన్నికల వరకు అంటే 15 ఏళ్లలో దశల వారీ­గా అమలు జరిగేలా వ్యూహం రూపొందించుకోవడం. మొం­డిగా గణాంకాలపై ఆధారపడకుండా ఓపికగా సున్నితంగా వ్యవహరించడం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విజయవంతంగా పూర్తి చేసినట్టు అన్నమాట.  

ఈ రెండింటి కన్నా ఆమోదయోగ్యమైనదే మిశ్రమ విధానమే మెరుగైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాను. ఈ విధానం నిష్పాక్షికమైన సమాఖ్య స్వభావాన్ని గౌరవిస్తూనే ప్రజాతంత్ర ప్రాతినిధ్యానికి పెద్దపీట వేస్తుంది. జనాభా నియంత్రణతోపాటు మెరుగైన ఆర్థిక వ్యవస్థ, ఇతర సుపరిపాలన ద్వారా సాధించిన విజయాలను లెక్కలోకి తీసుకుంటూనే రాజ్యాంగపరమైన శస్త్రచికిత్స అవసరం లేకుండా సమస్య పరిష్కరించేందుకు వీలుంటుంది. ఆర్థిక సంఘం నమూనా రూపంలో ఇప్పటికే జయప్రదమైన నమూనా అందుబాటులో ఉంది. ఆర్థిక సంఘం రూపొందించిన ఈ మిశ్రమ ప్రాతిపదికను కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాలు ఆమోదించాయి.

అమెరికా, జర్మనీ, ఆ్రస్టేలియా పార్లమెంటరీ వ్యవస్థల్లో దొంతర్ల వ్యవస్థ ఉన్న జర్మనీ విధానాన్ని ఎగువ సభ అయిన రాజ్యసభకు వర్తింపజేయాలి. అక్కడ రాష్ట్రాలను బట్టి సీట్లు 3 నుంచి గరిష్టంగా 6 ఉంటాయి. అమెరికా సెనేట్‌లో జనసంఖ్యతో సంబంధం లేకుండా 4 కోట్లు ఉన్న కాలిఫోరి్నయాకు, 6 లక్షల జనాభా ఉన్న వ్యోమింగ్‌ రాష్ట్రానికి 2 సీట్లే ఉంటాయి. ఇక ఆ్రస్టేలియాలో జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి 12 సీట్లు ఉంటాయి. ఈ లెక్కన జర్మనీ విధానాన్నే మనం ఫాలో కావాలి.

మోదీ కన్నా ఎన్నికల కమిషన్‌ గురించే ఇప్పుడు చర్చ : బీవీ రాఘవులు 
దేశంలో మోదీ కన్నా ఎన్నికల కమిషన్‌ గురించే ఇప్పుడు చర్చ జరుగుతుందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ అధ్యక్షుడు బీవీ రాఘవులు అన్నారు. నాటి ఈసీకి, ఇప్పటి ఈసీకి తేడా చాలా ఉందన్నారు. కొన్ని తప్పులున్నా, వ్యవస్థలోని లోపాలను నాటి ఈసీ సవరిస్తే, నేటి ఈసీ బానిస సంస్థగా మారిందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement