‘గెస్ పేపర్'లో కెమిస్ట్రీ ప్రశ్నలన్నీ అవుట్.. సీబీఐకి చిక్కిన లిస్ట్! | NEET UG Paper Leak Controversy, Chemistry Questions Matched Leaked Guess Paper 100%, Check More Details Insie | Sakshi
Sakshi News home page

‘గెస్ పేపర్'లో కెమిస్ట్రీ ప్రశ్నలన్నీ అవుట్.. సీబీఐకి చిక్కిన లిస్ట్!

May 20 2026 8:28 AM | Updated on May 20 2026 11:22 AM

100 percent Chemistry Questions Matched NTA Refers Question-Setters to CBI

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్’ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షకు ముందే బయటకు వచ్చిన ‘గెస్ పేపర్’లోని కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) ప్రశ్నలు, అసలు పరీక్షా పత్రంలోని ప్రశ్నలతో 100 శాతం సరిపోలడం జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)ను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అంతర్గత విచారణ ఆధారంగా పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్లు , అనువాదకుల పాత్రపై అనుమానంతో ఎన్‌టీఏ ఈ కేసును కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించింది.

సీబీఐ నిఘాలో 27 మంది ప్రొఫెసర్లు
మే 3న జరిగిన పరీక్ష తర్వాత, మే 7న సికార్‌కు చెందిన ఒక విజిల్‌బ్లోయర్ పంపిన ఈమెయిల్, లీకైన పేపర్ పిడిఎఫ్ ఆధారంగా ఈ భారీ కుంభకోణం బయటపడింది. దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కెమిస్ట్రీ పేపర్ రూపకల్పన , వివిధ భాషల్లోకి అనువాద ప్రక్రియలో పాల్గొన్న సుమారు 26 నుండి 27 మంది నిపుణుల జాబితాను ఎన్‌టీఏ సీబీఐకి సమర్పించింది. ఇందులో ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్ సెట్టర్లతో పాటు 24 మంది అనువాదకులు ఉన్నారు. ఇటీవల పుణేకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ పివి కులకర్ణిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.

నమ్మకమే కొంపముంచింది.. కొత్త సంస్కరణలు
ఇంతకాలం నమ్మకం ఆధారంగానే ఈ పరీక్షల వ్యవస్థ నడిచిందని, దీనిలోని వారే నమ్మకద్రోహానికి పాల్పడ్డారని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో థర్డ్ పార్టీ ద్వారా వీరి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలని ఎన్‌టీఏ యోచిస్తోంది. అంతేకాకుండా, వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు నలుగురు ఉన్నతాధికారులను నియమించడమే కాకుండా, ప్రైవేట్ రంగం నుండి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ), సీఎఫ్ఓ (సీఎఫ్‌ఓ)లాంటి నిపుణులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రకటన జారీ చేసింది.

జూన్ 21న రీటెస్ట్.. కఠిన నిబంధనలు
ఈ లీకేజీ నేపథ్యంలో, రాబోయే జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ రీటెస్ట్ కోసం కెమిస్ట్రీతో పాటు ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టుల పేపర్ సెట్టర్లను, ట్రాన్స్‌లేటర్లను ఎన్‌టీఏ పూర్తిగా మార్చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పునఃపరీక్ష ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి, పరీక్ష అత్యంత కట్టుదిట్టంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ‘కోటా’ జోరుకు బ్రేక్‌.. తెరపైకి ‘సికార్‌’ విద్యా విప్లవం!

Advertisement
 
Advertisement
Advertisement