బీజేపీ రాజకీయం.. కేంద్ర కేబినెట్‌లో సమూల మార్పులు? | BJP Political Plan Many Changes Central Cabinet | Sakshi
Sakshi News home page

బీజేపీ రాజకీయం.. కేంద్ర కేబినెట్‌లో సమూల మార్పులు?

May 20 2026 7:04 AM | Updated on May 20 2026 7:04 AM

BJP Political Plan Many Changes Central Cabinet

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు అధికార బీజేపీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మంత్రివర్గ విస్తరణ తథ్యమంటూ ఢిల్లీలో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీతోపాటు ప్రభుత్వంలోనూ కొత్త సమీకరణాలకు బీజేపీ అధిష్టానం తెరలేపే అవకాశముందని సమాచారం.

ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల 21వ తేదీన పూర్తిస్థాయి కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై రేపటి కేబినెట్‌ సమావేశంలో సమీక్ష జరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాంలో మెరుగైన ఫలితాలు సాధించడం, పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2027లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్రమంలో ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త మంత్రివర్గం, పార్టీ జాతీయ బృందం రూపుదిద్దుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువత, మహిళల్లో కొత్త వారికి అవకాశం కలి్పస్తూ, కొంతమంది సీనియర్‌ నేతలను పార్టీ సంస్థాగత బాధ్యతలకు అప్పగించేలా కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని రెండోసారి అధికారం చేపట్టాక 2.0 ప్రభుత్వంలో 2021 జూలైలో కేబినెట్‌లో భారీ మార్పులు చేపట్టారు. మొత్తం 12 మంది మంత్రులను తప్పించారు. కొత్తగా 36 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement