2 కి.మీ నడుచుకుంటూ వెళ్లిన సీఎం.. తిరిగొచ్చేటప్పుడు క్యాబ్‌.. | Sikkim CM Prem Singh Tamang walks 2 km to attend event | Sakshi
Sakshi News home page

2 కి.మీ నడుచుకుంటూ వెళ్లిన సీఎం.. తిరిగొచ్చేటప్పుడు క్యాబ్‌..

May 18 2026 9:29 PM | Updated on May 18 2026 9:36 PM

Sikkim CM Prem Singh Tamang walks 2 km to attend event

గువాహటి: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సోమవారం రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లో అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు సుమారు 2 కిలోమీటర్లు నడిచారు. తిరుగు ప్రయాణంలో ఇద్దరు అధికారులతో కలిసి క్యాబ్‌లో వెళ్లారు.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు పద్ధతులు అమలు చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై నిబద్ధత చూపిస్తూ తమాంగ్ ఇలా చేశారు. అధికారిక నివాసమైన మింటోక్‌గ్యాంగ్ నుంచి మనన్ కేంద్రా వరకు సుమారు 14 నిమిషాలు నడిచి కార్యక్రమానికి హాజరయ్యారు.

అంతేకాదు మే 15న అదే వేదికలో జరిగిన మరో కార్యక్రమానికీ వెళ్లేటప్పుడు, తిరిగి వస్తున్నప్పుడూ నడిచారు. “ఇది కేవలం మొక్కుబడిగా చేసింది కాదు. నాయకత్వం వ్యక్తిగత క్రమశిక్షణ, చర్యలతో ప్రారంభం కావాలని సిక్కిం ప్రజలకు బలమైన సందేశం ఇచ్చింది” అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

దేశం ఆర్థిక ప్రాధాన్యాలు, వనరుల సంరక్షణపై సమష్టిగా స్పందిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం.. వ్యయాన్ని తగ్గించే చర్యలను ప్రభుత్వం కేవలం విధానాలకే పరిమితం చేయకుండా ఆచరణలోనూ అమలు చేస్తున్నట్లు తెలియజేస్తోందని సీఎంవో చెప్పింది.

ప్రభుత్వ ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవడం, ఇంధన వినియోగ నియంత్రణపై సిక్కిం ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఇవి శాఖలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థలకు వర్తిస్తాయి.

ఈ చర్యల్లో ముఖ్యమైనది ముఖ్యమంత్రి వాహన బృందాన్ని 50 శాతం తగ్గించడం. అదనంగా ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు ఆడ్-ఈవెన్ విధానం అమలు చేయనున్నారు. ట్యాక్సీలు, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.

మే 14 నోటిఫికేషన్‌లో ఉద్యోగులు వీలైనంత వరకు ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించాలని, అవసరంలేని వాహన వినియోగం తగ్గించాలని, వర్చువల్ సమావేశాలు, డిజిటల్ సమన్వయంపై ఎక్కువగా ఆధారపడాలని ప్రభుత్వం సూచించింది. బాధ్యత, సమర్థత, క్రమశిక్షణతో కూడిన పాలనా సంస్కృతిని పెంపొందించడమే ఈ చర్యల లక్ష్యమని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement