కరువును తట్టుకునే వంగడాలను ప్రోత్సహించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐసీఏఆర్ సూచన
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, దీని కారణంగా పంటల దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదముందని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) వెల్లడించింది. గతంలో ఇదేమాదిరి ఎల్‌నినో పరిస్థితులు తలెత్తినప్పుడు వరి సహా మొక్కజొన్న, సజ్జ వంటి వర్షాధార పంటల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది.
ఈసారి పంటల దిగుబడులు కనీసం 10 శాతం మేర తగ్గుతాయని అంచనా వేసింది. నైరుతి రుతు పవనాలతో సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే అంచనా వేసింది. జూన్– సెప్టెంబర్ మధ్య కాలంలో తక్కువ వర్షాల కారణంగా నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని ఐసీఏఆర్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 2002, 2004, 2009 సీజన్‌లలో ఎల్‌నినో ఏర్పడినప్పుడు 77 జిల్లాల్లో వరి దిగుబడి 10 శాతానికి పైగా పడిపోగా, మొక్కజొన్న ఉత్పత్తి 65 జిల్లాల్లో ఇదే స్థాయిలో తగ్గినట్లు గుర్తించింది.
ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశ
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో వరిపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా కనిపించి నట్లు తెలిపింది. ఇదే సమయంలో జొన్న, సజ్జ దిగుబడులు కూడా 36 జిల్లాల్లో 10 శాతానికి పైగా తగ్గినట్లు గుర్తించామంది. వర్షాధార ప్రాంతాలే ఎల్‌నినో ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయని వివరించింది. ఈ ఏడాది సైతం ఎల్‌నినో పరిస్థితులు కొనసాగనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ఐసీఏఆర్ సూచించింది. కరువును తట్టుకునే విత్తనాల ప్రోత్సాహం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, సమర్థవంతమైన నీటి నిర్వహణ, ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాల అమలు ద్వారా రైతుల నష్టాలను తగ్గించాలని రాష్ట్రాలకు సూచించింది.
ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్?


