సంబంధాలు ఉన్నతస్థాయికి | PM Modi attends the 3rd India-Nordic Summit | Sakshi
Sakshi News home page

సంబంధాలు ఉన్నతస్థాయికి

May 20 2026 5:35 AM | Updated on May 20 2026 5:35 AM

PM Modi attends the 3rd India-Nordic Summit

నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, ఐస్‌లాండ్, డెన్మార్క్‌ ప్రధానులతో ముచ్చటిస్తున్న భారత ప్రధాని మోదీ

భారత్, నార్డిక్‌ దేశాల మధ్య గ్రీన్‌ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం 

మూడో ఇండియా–నార్డిక్‌ సదస్సులో నిర్ణయం  

ఓస్లో: తమ సంబంధాలను ఇకపై గ్రీన్‌ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని భారత్, నార్డిక్‌ దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని మోదీ మంగళవారం నార్వే రాజధాని ఓస్లోలో మూడో ఇండియా–నార్డిక్‌ సదస్సులో పాల్గొన్నారు. క్లీన్‌ ఎనర్జీ, సుస్థిరాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, నవీన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. మోదీతోపాటు ఐస్‌లాండ్‌ ప్రధాని క్రిస్ట్రన్‌ ఫ్రొస్టాడాటిర్, ఫిన్‌లాండ్‌ ప్రధాని పెటెరీ ఓర్పో, డెన్మార్క్‌ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్, నార్వే ప్రధాని జోనా గర్‌ స్టోర్, స్వీడన్‌ ప్రధానమంత్రి ఉల్ఫ్‌ క్రిస్టర్‌సన్‌ ఈ సదస్సుకు హాజరయ్యారు.

అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదంపై భారతదేశం, నార్డిక్‌ దేశాలు స్పష్టమైన, ఐక్య వైఖరిని కలిగి ఉన్నాయని మోదీ తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో రాజీపడి ప్రసక్తే లేదని, ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని స్పష్టంచేశారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు కొనసాగుతున్న తరుణంలో నియమాల ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేయడానికి భారత్, నార్డిక్‌ దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని వెల్లడించారు.

ఉక్రెయిన్‌ అయినా, పశ్చిమాసియా అయినా వివాదాల ప్రారంభ పరిష్కారానికి, శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు మద్దతునిస్తూనే ఉంటామని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన పట్ల నిబద్ధత తమను సహజ భాగస్వాములను చేస్తోందన్నారు. గ్రీన్‌ టెక్నాలజీ భాగస్వామ్యంతో మొత్తం ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందిస్తామని మోదీ పేర్కొన్నారు.  

మూడు దేశాల ప్రధానులతో భేటీ  
ఐస్‌లాండ్, ఫిన్‌లాండ్, డెన్మార్క్‌ దేశాలతో క్లీన్‌ ఎనర్జీ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరాభివృద్ధి, డిజిటలీకరణ, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్‌ టెక్నాలజీ తదితర రంగాల్లో పరస్పర సంబంధాలను బలపేతం చేసుకోవడంపై మోదీ చర్చించారు. ఆయన మంగళవారం ఆయా దేశాల ప్రధానమంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్, మూడు నార్డిక్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్‌లో పర్యటించాలని మూడుదేశాల ప్రధానులను మోదీ ఆహ్వానించారు. ఐస్‌లాండ్, ఫిన్‌లాండ్, డెన్మార్క్‌ దేశాలతో సంబంధాలకు భారత్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మోదీ ఉద్ఘాటించారు.  

ఇటలీకి పయనమైన మోదీ  
ప్రధాని మోదీ నార్వే పర్యటన పూర్తిచేసుకొని మంగళవారం ఇటలీకి పయనమయ్యారు. నార్వే పర్యటన ఫలవంతంగా ముగిసిందని ఆయన ‘ఎక్స్‌‘లో పోస్టుచేశారు. పలు సమావేశాల్లో పాల్గొన్నానని, కీలక రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు.   

Advertisement
 
Advertisement
Advertisement