ట్రంప్‌ అల్టిమేటం.. అమెరికాకు ఇరాన్‌ ఘాటు హెచ్చరిక | Middle East Conflict : Iran Reacts Trump Latest Ultimatum | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ అల్టిమేటం.. అమెరికాకు ఇరాన్‌ ఘాటు హెచ్చరిక

May 20 2026 7:50 AM | Updated on May 20 2026 7:56 AM

Middle East Conflict : Iran Reacts Trump Latest Ultimatum

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. “రెండు మూడు రోజుల్లో శాంతి ఒప్పందానికి రాకపోతే, కొత్త దాడులు తప్పవు” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. గల్ఫ్ దేశాల అభ్యర్థనతో మంగళవారం జరగాల్సిన దాడిని వాయిదా వేశానని.. ఇరాన్‌ దిగి రాకుంటే వారాంతంలో దాడులు తప్పవని సంకేతాలిచ్చారాయన. ఈ అల్టిమేటంపై ఇరాన్‌ స్పందించింది. 

ట్రంప్‌ హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి స్పందించారు. అదే జరిగితే తామేంటో చూపిస్తామని అంటున్నారాయన. ‘‘మళ్లీ యుద్ధం జరిగితే అమెరికాను మామూలుగా దెబ్బ తీయం. మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. అందుకు ఆ దేశం సిద్ధంగా ఉండాలి’’ అని ఘాటు హెచ్చరికలు జారీ చేశారాయన. అలాగే.. ఇరాన్ తొలిసారిగా అమెరికా F-35 జెట్‌ను కూల్చివేసిందని చెప్పిన అరగ్చి.. అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదికలోనే జరిగిన నష్టాలు బయటపడ్డాయని గుర్తుచేశారు.

అరగ్చి చెప్పిన “మరిన్ని సర్‌ప్రైజ్‌లు” అంచనా వేయడం కాస్త కష్టమే. అయితే యుద్ధంలో ఇరాన్ వ్యూహాలు, దాడుల స్వభావం చూసుకుంటే మాత్రం..  

  1. అధునాతన డ్రోన్ దాడులు: ఇరాన్ ఇప్పటికే అమెరికా MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చివేసింది. భవిష్యత్తులో మరింత శక్తివంతమైన, స్వార్మ్‌ (గుంపులుగా వచ్చే) డ్రోన్ దాడులు జరిగే చాన్స్‌ లేకపోలేదు.
  2. మిసైల్ దాడులు: సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసి KC-135 ట్యాంకర్లు, E-3 AWACS‌ను దెబ్బతీసింది. ఇలాంటి దీర్ఘశ్రేణి క్షిపణి దాడులే మళ్లీ జరగవచ్చు.
  3. సైబర్ దాడులు: ఇరాన్ గతంలో అమెరికా నెట్‌వర్క్‌లపై సైబర్ దాడులు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కొత్త యుద్ధంలో సైబర్ రంగంలో పెద్ద ఎత్తున దాడులు జరగవచ్చు.
  4. సముద్ర మార్గాల అడ్డంకులు: హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ కుదేలవుతుంది.
  5. అనూహ్యమైన ఆయుధ వినియోగం: అరగ్చి చెప్పిన “సర్‌ప్రైజ్”లో కొత్త రకం యుద్ధ సాంకేతికత, లేదంటే ఇప్పటివరకు బయటపడని ఆయుధాలు ఉండే అవకాశం ఉంది.

కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక ప్రకారం.. ఈ యుద్ధంలో అమెరికా కనీసం 42 సైనిక విమానాలను కోల్పోయింది. వీటిలో 24 MQ-9 రీపర్ డ్రోన్లు, నాలుగు F-15E ఫైటర్ జెట్లు, ఒక A-10 థండర్‌బోల్ట్, రెండు MC-130J ప్రత్యేక ఆపరేషన్ విమానాలు, ఒక KC-135 ట్యాంకర్, ఒక MQ-4C ట్రిటాన్ డ్రోన్ ఉన్నాయి. అదనంగా.. F-35A జెట్, E-3 సెంట్రీ AWACS, HH-60W హెలికాప్టర్ వంటి విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రక్షణ విభాగం పెంటగాన్ అంచనా ప్రకారం.. ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటివరకు 29 బిలియన్ డాలర్ల ఖర్చు తెచ్చింది.

ఫిబ్రవరి 28, 2026న “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. బదులుగా ఇరాన్‌ మిత్రపక్షాల సాయంతో కౌంటర్‌కు దిగింది. అయితే.. ఏప్రిల్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ, ఆపై పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో చర్చలకు అడుగులు పడడంతో యుద్ధం ముగియవచ్చని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. 

శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఓవైపు చర్చల ప్రభావంతో యుద్ధ తీవ్రత కొంత తగ్గినా.. ఇప్పుడు మళ్లీ ఇరు దేశాల కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ అల్టిమేటం, అరఘ్చి హెచ్చరికలతో యుద్ధం మరోసారి మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఘర్షణలు ఏ సంక్షోభానికి దారి తీస్తాయోనని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement