ఎబోలా డేంజర్‌ బెల్స్‌.. 131 మరణాలు.. | WHO Raises Alarm Over Speed Of Ebola Outbreak As Congo | Sakshi
Sakshi News home page

ఎబోలా డేంజర్‌ బెల్స్‌.. 131 మరణాలు..

May 20 2026 9:18 AM | Updated on May 20 2026 9:18 AM

WHO Raises Alarm Over Speed Of Ebola Outbreak As Congo

కిన్షాసా: ఆఫ్రికాలోని కాంగో తూర్పు ప్రాంతంలో అరుదైన ఎబోలా వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ అంటువ్యాధి బారిన పడి ఇప్పటి వరకు కనీసం 131 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో 513 అనుమానిత కేసులున్నాయంటున్నారు. ఎబోలా వ్యాప్తి, కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

మొదటి మరణం సంభవించిన తర్వాత కూడా అధికారులు సాధారణంగా వచ్చే వైరస్‌ వేరియట్‌ అనుమానంతో పరీక్షలు చేయడం, అందులో నెగటివ్‌ అని తేలడంతో ఈ వైరస్‌ కొన్ని వారాల పాటు ఎవరికీ దొరకకుండానే వ్యాప్తి చెందిందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. బుండిబుగ్యో అనే ఈ అరుదైన వైరస్‌ వేరియంట్‌కు మందులు, వ్యాక్సిన్లు లేవన్నారు.  

త్వరలో డబ్ల్యూహెచ్‌వో అత్యవసర భేటీ 
కాంబోలో ఎబోలా వేగంగా ప్రమాదకరరీతిలో వ్యాప్తి చెందుతుండటంపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయెసుస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటీరెండు రోజుల్లోనే తమ విభాగం సమావేశమై, వ్యాధి కట్టడికి అవసరమైన చర్యలపై చర్చిస్తుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కేసులు, ఆరోగ్య సిబ్బంది మరణాలు, ప్రజలు ఒకే చోట ఉండకుండా తరచూ రాకపోకలు సాగించడం వంటివాటిపైనా దృష్టి సారిస్తామన్నారు. కాంగోలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన నేపథ్యంలో సమన్వయంతో చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. ఎబోలా కేసులు పెరుగుతున్న సరిహద్దుల్లోని ఉగాండాకు చెందిన రెండు ప్రావిన్స్‌లకు కూడా ఆరోగ్య సిబ్బందిని పంపిస్తామన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement