‘అధిక సంతాన’ వ్యామోహం! | Sakshi Editorial On Chandrababu Naidu Govt High fertility Issue | Sakshi
Sakshi News home page

‘అధిక సంతాన’ వ్యామోహం!

May 19 2026 4:22 AM | Updated on May 19 2026 4:22 AM

Sakshi Editorial On Chandrababu Naidu Govt High fertility Issue

చెప్పడానికేం లేనప్పుడూ, సంజాయిషీ ఇవ్వడానికి మాటలు దొరకనప్పుడూ ఏదో ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి ప్రజలను గందరగోళపరచడం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలవాటైన విద్య. తిరుమల లడ్డూ మొదలుకొని అనేకానేక అంశాలపై సృష్టించిన వివాదాలు నీరుగారి, తన కుట్రలు బయటపడ్డాక ఇక సూపర్‌ సిక్స్‌ హామీల గురించీ, ఇతరత్రా వాగ్దానాల గురించీ ఏదో ఒకటి చెప్పకతప్పని స్థితి ఎదురైంది. అందుకే ఎక్కువమంది పిల్లల్ని కనండంటూ ఆయన ఊదరగొడుతున్నారు. దాన్నెవరూ పట్టించుకున్న దాఖలా లేకపోవటంతో తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో అధిక సంతానం ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఏమేం చేయబోతున్నదో ఏకరువు పెట్టారు. మూడో బిడ్డను కంటే రూ. 30,000, నాలుగో బిడ్డను కంటే రూ. 40,000 ఇస్తామని ప్రకటించారు. 

ఈ సొమ్మును పురిటి మంచం దగ్గరకే తీసుకొచ్చి ముట్టజెబుతారట! దీన్ని ప్రకటించేముందు ఎన్నికల హామీల అతీ గతీ ఏమైందో నిజాయితీగా చెబితే బాగుండేది. కనీసం చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికీ ఏడాదికి రూ. 15,000 చొప్పున ఇస్తానన్న ‘తల్లికి వందనం’ ఏమైందో... కుటుంబంలో ఎందరు మహిళలుంటే అందరికీ నెలకు రూ. 1,500 చొప్పున అందిస్తానన్న ‘ఆడబిడ్డ నిధి’ ఎటుపోయిందో...‘కల్యాణ లక్ష్మి’ ఎంత ఘనంగా అమలవుతున్నదో బాబు చెప్పాల్సింది. గత వాగ్దానాలకే దిక్కూ మొక్కూలేని తరుణంలో కొత్త రాగం మొదలెట్టారు. 

వాస్తవానికి ‘అధిక సంతానం’ ఆలోచన బాబు పుర్రెకు పుట్టిన బుద్ధికాదు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందనీ, అందువల్ల దక్షిణాది నష్టపోతుందనీ తెలిశాక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా అనేకులు ఆందోళనపడి, అధిక సంతానాన్ని కనమంటూ బహిరంగ సభల్లో చెప్పడం మొదలెట్టారు. కానీ అంతటితో ఆగితే వారికీ, బాబుకూ తేడా ఏముంటుంది? అందుకే ఈ నజరానాలు! నిజానికి కేంద్రంలో ఎన్డీయే సర్కారు తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన ప్రస్తుత స్థితిలో నియోజకవర్గాల పునర్విభజనకు ఎంచుకున్న ప్రాతిపదిక విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించవచ్చు. కానీ అలాంటి దుస్సాహసం చేస్తే కొంప కొల్లేరవుతుందని భయపడ్డారు. అలాగని లోలోన రగులుతున్న అసంతృప్తిని దాచుకోలేకపోతున్నారు. ఈలోగా గతంలో ఇచ్చిన విచ్చలవిడి హామీలు శాపాలై వెంటాడుతున్నాయి. వీటినుంచి తప్పించుకోవాలంటే ‘అధిక సంతానమే’ ఏకైక మార్గమని బాబుకు తోచినట్టుంది. 

గండం గడిచేందుకు అవసరార్థం ఏదో ఒకటి మాట్లాడటం మొదటినుంచీ ఆయనకు అలవాటే. 2024 ఎన్నికల్లో మరోసారి ఓటమి తప్పదని గ్రహించాక ఆదరా బాదరాగా ఎన్డీయే పంచన చేరారు. అప్పటికీ విజయంపై గ్యారెంటీ లేకపోవటంతో ఎన్నికల సంఘం(ఈసీ) ప్రాపకంతో కావాల్సినవన్నీ చేసుకున్నారు. మరోపక్క మోసపూరిత హామీలతో మోతెక్కించారు. ఇక పోలింగ్‌ రోజున ఈవీఎంల ప్రహసనం, దొంగ ఓట్ల జాతర సరేసరి. ఎన్ని చేసినా...ఇచ్చిన వాగ్దానాల మాటేమిటన్న ప్రశ్న ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అందుకే ఈ అధిక సంతానం ప్రచారం!

ఇటీవల కాగ్‌ విడుదల చేసిన తాత్కాలిక లెక్కలు ఏపీ సర్కారు నిర్వాకాన్ని రోడ్డుకీడ్చాయి. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధంటూ బాబు చెప్పినవన్నీ ఉత్త డొల్ల మాటలని తేల్చిచెప్పాయి. 10.75 శాతం వృద్ధి రేటు అంటూ బాబు చెప్పిందే నిజమైతే పన్ను రాబడులు 3.22 శాతం పడిపోవటమేమిటి? సంపద సృష్టి మాట దేవుడెరుగు... ఉన్న సంపదంతా ఊడ్చుకుపోతోందని కాగ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా ఏ భరోసాతో పిల్లల్ని కంటారు? ఈ సంక్షోభకాలంలో సర్కారు ఒక్క దఫా ఇచ్చే డబ్బు ఏమూలకు సరిపోతుంది? ఎన్నాళ్లొస్తుంది? ఈ విషయంలో ప్రముఖ పిల్లల వైద్యురాలు డాక్టర్‌ శివరంజని సంతోష్‌ సూటిగా నిలదీస్తే ఇంతవరకూ జవాబు లేదు. కనీసం పిల్లల సంక్షేమానికీ, వారి ఆరోగ్యరక్షణకూ, పౌష్టికాహారానికీ, విద్యకూ, మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకూ సంబంధించిన పథకాలు ప్రకటిస్తే వేరుగా ఉండేది. సందుసందునా బెల్ట్‌ షాపులతో మద్యం ఏరులై పారుతున్న రాష్ట్రంలో కుటుంబాలు ఏ భరోసాతో పిల్లల్ని కనాలి? అరకొర ఆదాయంతో సగటు ఇల్లాళ్లు కంటతడి పెడుతుంటే ఎందుకీ మతిలేని మాటలు?! 

Advertisement
 
Advertisement
Advertisement