బిడ్డకు పాలు పట్టాల్సిన తల్లి యాసిడ్ తాగించి.. | Infant on ventilator after mother made her drink acid in Rajasthan | Sakshi
Sakshi News home page

బిడ్డకు పాలు పట్టాల్సిన తల్లి యాసిడ్ తాగించి..

May 19 2026 3:08 PM | Updated on May 19 2026 3:32 PM

Infant on ventilator after mother made her drink acid in Rajasthan

Representative Image

జైపూర్‌: బిడ్డలకు ఏ కష్టం వచ్చినా కన్న పేగు తల్లడిల్లిపోతుంది. తన బిడ్డకు చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకుంటుంది. కంటికి రెప్పలా కాపాడుకుటుంంది. కానీ, ఓ కన్నతల్లి మాత్రం కర్కశత్వం ప్రదర్శించింది. బిడ్డను ఎత్తుకోవాల్సిన చేతులతోనే క్రూరంగా వ్యవహరించింది. 

ఆడుకుంటూ ఉండాల్సిన 8 నెలల పాప.. ఆ తల్లి కారణంగా ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడుతోంది. బిడ్డకు పాలు పట్టాల్సిన తల్లి యాసిడ్ తాగించింది. దీంతో నోరు, ముక్కు నుంచి రక్తం కారుతూ వెంటిలేటర్‌పై చిన్నారి విలవిల్లాడుతోంది. ఏ పాపమూ తెలియని ఆ బిడ్డ బాధను చూసి బంధువులు తీవ్ర మనోవేదకు గురయ్యారు.  

రాజస్థాన్‌లోని ఖైర్తల్-తిజారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది నెలల చిన్నారి ప్రాణాల కోసం పోరాడుతోంది. ఆమె తల్లి యాసిడ్ తాగించిందని పోలీసులు మంగళవారం తెలిపారు. నోరు, ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్న ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఆ పసికందు వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన భివాడి ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. సోమవారం ఘటన జరిగిన సమయంలో చిన్నారి తండ్రి మోహిత్ పనికి వెళ్లాడు. ఇంట్లో చిన్నారి తల్లితో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో చిన్నారికి మహిళ బలవంతంగా యాసిడ్ తాగించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సోమవారం సాయంత్రం చిన్నారి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను భివాడిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ వేద్ ప్రకాశ్ మంగళవారం మాట్లాడుతూ.. ఆస్పత్రి నుంచి చిన్నారి గురించి సమాచారం అందిందని తెలిపారు. తర్వాత తాను ఆస్పత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నానని చెప్పారు.

“తన భార్య కుమార్తెకు బలవంతంగా యాసిడ్ తాగించిందని తండ్రి ఆరోపించాడు. చిన్నారి వెంటిలేటర్‌పై ఉంది” అని ఆయన తెలిపారు. లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement