ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్ల దందా | Srivani Trust Darshan tickets in the hands of brokers | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్ల దందా

May 20 2026 4:56 AM | Updated on May 20 2026 4:56 AM

Srivani Trust Darshan tickets in the hands of brokers

టీటీడీ ఐటీ విభాగం డీజీఎంను ముందు పెట్టి బ్లాక్‌ మార్కెట్‌  

అనర్హులను అడ్డు పెట్టుకుని దళారుల చేతులకు వ్యవస్థ అప్పగింత 

ఫలితంగా 10–15 సెకన్లలోనే టికెట్లు క్లోజ్‌  

ఓ ట్రావెల్స్‌ వ్యవస్థ ద్వారా దందా బయటపడటంతో పెద్దల్లో వణుకు 

ఈ నిందను గత ఐటీ జీఎంపైకి నెడుతూ అడ్డగోలు దుష్ప్రచారం 

టీటీడీ ఐటీ జీఎం మురళీ సందీప్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ వ్యక్తి అంటూ డైవర్షన్‌ 

వాస్తవానికి కూటమి ప్రభుత్వం రాగానే సందీప్‌రెడ్డి స్విమ్స్‌కు బదిలీ 

ఈ నిజాన్ని దాచి భక్తుల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా కుయుక్తులు  

ప్రస్తుతం ఐటీ డిప్యూటీ జీఎంగా విధుల్లో ఉన్నది వెంకటేశ్వరనాయుడు  

అవినీతికి పాల్పడటంతో గత పాలక మండలి హయాంలో ఈయనకు మెమో  

సాక్షి, అమరావతి : అసలు దొంగలు తప్పించుకోవాలంటే, ఇంకెవరిపైనైనా దొంగ అనే ముద్ర వేయాలి. తద్వారా తాము దొంగలము, దోషులము కాదని ప్రజల దృష్టిని మళ్లించాలి. టీటీడీ ఆన్‌లైన్‌లో దొరకాల్సిన శ్రీవాణి ట్రస్ట్‌ దర్శన టిక్కెట్లను దళారుల చేతుల్లో పెట్టి.. సెకన్ల వ్యవధిలో టికెట్లు దక్కించుకుంటున్న వ్యవహారంలో అసలు సూత్రధారులు టీటీడీ, ప్రభుత్వ పెద్దలు అచ్చంగా ఇలానే చేస్తున్నారని స్పష్టమవుతోంది. శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్ల కోసం భక్తులు తమ వివరాలు నమోదు చేసేలోపే కేవలం 10–15 సెకండ్ల వ్యవధిలోనే అత్యధికంగా టికెట్లు బుక్‌ అవ్వడం వెనుక పెద్ద స్థాయి రాకెట్‌ ఉందని తేటతెల్లమైంది. 

పై స్థాయిలో పెద్దల సహకారం లేనిదే టీటీడీ చరిత్రలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద దందా ఇలా కొనసాగదని టీటీటీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా శ్రీవాణి టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలు తాజాగా వెలుగులోకి రాగానే అటు భక్తులు, ఇటు టీటీడీ, ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాలక మండలి పెద్దలకు పూర్తి అనుకూలురుగా, చెప్పింది చెప్పినట్లు చేసే వ్యక్తిని ముందుపెట్టి.. అతనికి అర్హత లేకపోయినా అందలం ఎక్కించి దందా సాగిస్తున్నారు. 

ఏఈవో స్థాయిలో పనిచేసే వెంకటేశ్వర నాయుడుని ముందు పెట్టి.. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించి అనుకున్నది అనుకున్నట్లు చేస్తున్నారు. ఇదే వెంకటేశ్వర నాయుడు ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు నిరూపితం కావడంతో గత పాలక మండలి హయాంలో ఆయనకు మెమో ఇచ్చారు. అలాంటి ఆయన్ను ముందు పెట్టి.. ప్రస్తుత టీటీడీ పాలక మండలి పెద్దలు అతనికే ఉన్నత బాధ్యతలు అప్పగించారంటే అర్థం ఏమిటి? టీటీడీనీ స్కామ్‌ల మయంగా మార్చడానికి టీటీడీ, ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారనే కదా!   

ఈ ప్రభుత్వం వచ్చాకే శ్రీవాణి టికెట్ల దందా 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సనాతన హైందవ ధర్మం పరిరక్షణ విశ్వవ్యాప్తం చేసేందుకు నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో 2019 సెప్టెంబర్‌ 23న టీటీడీ శ్రీవాణి (శ్రీవేంకటేశ్వర ఆలయాల నిర్మాణం ట్రస్ట్‌) ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్‌ ద్వారా ప్రొటోకాల్‌ తరహా వీఐపీ బ్రేక్‌ దర్శనం చేసుకోదలచిన భక్తులు రూ.10 వేలు విరాళంగా, రూ.500 టికెట్‌ రూపంగా చెల్లించాలి. ఈ టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన నిధులతో హిందూ దేవాలయాల నిర్మాణాలు, పునరుద్దరణ, ధూపదీప నైవేద్యాలకు ఖర్చు చేయటమే శ్రీవాణి ట్రస్ట్‌ లక్ష్యం. 

ఇందులో భాగంగా ప్రతి రోజూ శ్రీవాణి ట్రస్ట్‌ కింద టీటీడీ వెయ్యి టికెట్లు జారీ చేయటం ప్రారంభించింది. ఇందులో 500 టికెట్లు ముందస్తుగా ఆన్‌లైన్‌ విధానంలో విడుదల చేసేవారు. మరో 500 టికెట్లను ఆఫ్‌లైన్‌ విధానం ద్వారా భక్తులు నేరుగా టికెట్‌ పొందేవారు. ఆఫ్‌లైన్‌ విధానం ద్వారా పంపిణీ చేసే 500 టికెట్లలో 400 టికెట్లు టీటీడీ జేఈఓ కార్యాలయం వద్ద ఇచ్చేవారు. మిగిలిన 100 టికెట్లు తిరుపతి విమానాశ్రయం వద్ద ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి అక్కడే విక్రయించేవారు. కాగా, ఎన్నికలకు ముందు శ్రీవాణి ట్రస్టును చంద్రబాబు రద్దు చేస్తామన్నారు. 

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రస్టు రద్దు మాటను పక్కనపెట్టి, దాని ఆధారంగా నిధులను కొల్లగొట్టేందుకు స్కెచ్‌ వేశారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ హయాంలో వెయ్యి టికెట్లు ఇస్తే.. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సంఖ్యను రెండు వేలకు పెంచేశారు. విమానాశ్రయం వద్ద మాత్రమే కొన్ని టికెట్లను ఆఫ్‌లైన్లో ఇస్తున్నారు. మిగతావన్నీ ఆన్‌లైన్‌ విధానం ద్వారా విక్రయిస్తున్నారు. దీని ఆధారంగానే దందాకు శ్రీకారం చుట్టారని తెలిసింది. ఆటో ఫిల్లింగ్‌ పద్దతుల ద్వారా దళారులను అడ్డుపెట్టుకుని దందా సాగిస్తున్నారని స్పష్టమవుతోంది. ఫలితంగానే ఈ టికెట్లు 10–15 సెకన్ల వ్యవధిలోనే ఫిల్‌ అవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

అప్పట్లో నిబంధనల ప్రకారమే నియామకం 
మురళీ సందీప్‌రెడ్డిని టీటీడీ ఐటీ విభాగం జనరల్‌ మేనేజర్‌గా నియమించడం పూర్తి నిబంధనల ప్రకారమే జరిగిందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.  టీటీడీ ఐటీ విభాగం జనరల్‌ మేనేజర్‌ నియామక ప్రక్రియకు విధివిధానాలు, అర్హతలు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి నియమించిన కమిటీనే నిర్ధారించింది. ఆ కమిటీలో సుధా నారాయణమూర్తి లాంటి పలువురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) ప్రొఫెసర్, ఇస్రో శాస్త్రవేత, ఎన్‌ఐటీ వరంగల్‌ ప్రొఫెసర్‌ సభ్యులుగా ఉన్న నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో మురళీ సందీప్‌రెడ్డి నియామకం జరిగింది. ఆ ఎంపిక కమిటీలో మరో సభ్యుడిగా నియమితులైన నాగారం అమర్‌ను అర్హత లేకుండా కమిటీలో నియమించినట్టు టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవానికి అమర్‌ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చదివారు. ప్రముఖ సంస్థ వాల్‌మార్ట్‌తో పాటు ఫ్లిప్‌కార్డు, మింధ్రా వంటి దిగ్గజ కంపెనీల్లో పని చేశారనే విషయాన్ని దాచి మరీ దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. 

ఇంకోవైపు.. టీటీడీ ఐటీ విభాగం జనరల్‌ మేనేజర్‌ నియామక ఇంటర్వ్యూలు 2022 మే నెలలో కొనసాగగా, ఆ బాధ్యతల్లో మురళీ సందీప్‌రెడ్డిని 2024 మార్చిలో ఖారారు చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్లో మీడియా చెబుతున్నట్లు అప్పటి టీటీడీ పాలక మండలి పెద్దలు తమకు కావాల్సిన వారిని ఆ బాధ్యతల్లో నియమించాలని అనుకుంటే ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి దాదాపు రెండేళ్ల కాలం ఎందుకు వేచిచూస్తారనే ప్రశ్నపై అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. శ్రీవాణి టిక్కెట్ల అక్రమాల ఆరోపణలు తమపైకి రావడంతోనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి పెద్దలు మురళీ సందీప్‌రెడ్డిపై, ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని తేటతెల్లమైంది.   

దందా బయట పడగానే డైవర్షన్‌ రాజకీయం 
తొలుత చెన్నైకి చెందిన ‘ఎంఎస్‌ పద్మావతి ట్రావెల్స్‌’ అనే సంస్థపై వచ్చిన ఫిర్యాదుతో శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్ల కుంభకోణం వ్యవహారం వెలుగులోకి రాగానే టీటీడీ, ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎప్పటిలాగే ఎల్లో మీడియా ద్వారా డైవర్షన్‌ రాజకీయానికి తెర లేపారు. టీటీడీ ఐటీ విభాగం జనరల్‌ మేనేజర్‌ మురళీ సందీప్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ వ్యక్తి అని, దీంట్లో ఆయన ప్రమేయం ఉందన్నట్లు దుష్ప్రచారానికి ఒడిగట్టారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సదరు మురళీ సందీప్‌రెడ్డిని స్విమ్స్‌లో సాఫ్ట్‌వేర్‌ మానిటరింగ్‌ విభాగానికి బదిలీ చేసింది. టీటీడీలో ఆ పోస్టు నుంచి ఆయన్ను వెంటనే తొలగించింది. 

ఈ లెక్కన దాదాపు రెండేళ్లుగా టీటీడీ ఐటీ విభాగం జనరల్‌ మేనేజర్‌ విధుల్లో ఆయన లేనేలేరు. టీటీడీ ఐటీ విభాగం జనరల్‌ మేనేజర్‌కు ఉండే అధికారిక ఆన్‌లైన్‌ లాగిన్‌లు అన్నింటి నుంచీ మురళీ సందీప్‌రెడ్డిని అప్పుడే తొలగించారు కూడా. కానీ, శ్రీవాణి ట్రస్టు దర్శన టిక్కెట్ల బ్లాక్‌ మార్కెట్‌ దందా బట్టబయలు కాగానే, బెంబేలెత్తిపోయిన టీటీటీ, ప్రభుత్వ పెద్దలు మురళీ సందీప్‌రెడ్డే ఇప్పటికీ టీటీడీ ఐటీ విభాగం జనరల్‌ మేనేజర్‌ విధుల్లోనే కొనసాగుతున్నట్టు దుష్ప్రచారం చేస్తూ ఎల్లో మీడియా ద్వారా డైవర్షన్‌ రాజకీయానికి తెరతీయడం దుర్మార్గం.  

Advertisement
 
Advertisement
Advertisement