న‌న్ను చంపాల‌ని చూస్తున్నారు: పాస్ట‌ర్ అభిన‌య్‌ | Pastor Abhinay Darshan First Reaction After Attack | Sakshi
Sakshi News home page

ప్రవీణ్ పగడాలలా.. న‌న్ను చంపాల‌ని చూస్తున్నారు: పాస్ట‌ర్ అభిన‌య్‌

May 19 2026 1:59 PM | Updated on May 19 2026 4:01 PM

Pastor Abhinay Darshan First Reaction After Attack

విశాఖప‌ట్నం: పాస్ట‌ర్‌ ప్రవీణ్ పగడాల లాగే త‌న‌ను చంపాలని చూస్తున్నారని భ‌రోసా పార్టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ధార‌ అభినయ్ ద‌ర్శ‌న్‌ ఆరోపించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ద‌ర్యాప్తుపై త‌న‌కు నమ్మకం లేదని అన్నారు. త‌న‌పై దాడి చేసిన వారిని వదిలేసి, త‌న‌ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారని వాపోయారు. పోలీసులు డ‌బుల్ గేమ్ ఆడుతున్నారంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేస్తున్నందునే త‌న‌పై దాడి జ‌రిగింద‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు.

''నాపై నేనే దాడి చేసుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. నాపై దాడి విషయంలో పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పాస్టర్లందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరిస్తున్నారు. నాపై దాడి వెనుక కుట్ర దాగి ఉంది. నాపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకి సంబంధం ఉందని అనుకోను. కొంతమందిపై నాకు అనుమానం ఉంది. వారి పేర్లు త్వరలోనే బయట పెడతాను. ప్రవీణ్ పగడాల నాలుగు బ్రాండ్లు తాగి యాక్సిడెంట్ చేసినట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించారు. ప్రవీణ్ పగడాల విష‌యంలో జ‌రిగింది పూర్తిగా అన్యాయ‌మే. ప్రవీణ్ పగడాలపై వేసిన‌ట్టుగానే నాపై నింద‌లు వేస్తున్నారు. దాడుల‌కు నేను భ‌య‌ప‌డ‌ను. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాధికారుల‌ను ప్ర‌శ్నిస్తూనే ఉంటాన‌''ని అభినయ్ అన్నారు.

దాడిని ఖండించిన పాడేరు ఎమ్మెల్యే 
పాస్టర్ అభినయ్‌పై దాడి చేసిన వారిని చ‌ట్ట‌ప్ర‌కారం కఠినంగా శిక్షించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. అభినయ్‌పై దాడిని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. అభినయ్‌పై దాడి చేసిన వారిని ప్రజల ముందు పోలీసులు నిలబెట్టాలని కోరారు.

''జరిగిన దాడిపై నేనే పోలీసులకు ఫోన్ చేసి పూర్తిస్థాయి విచారణ జరపాలని సూచించాను. ఈ దాడి తన అనుచరులు చేశారని కూటమి నాయకులు ప్రచారం చేయడం దురదృష్టకరం. ఒక గిరిజన బిడ్డపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు నాకు క్షమాపణ చెప్పాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక వైఎస్సార్‌సీపీపై అస‌త్య‌ ప్రచారాలు చేస్తున్నార''ని విశ్వేశ్వరరాజు  మండిప‌డ్డారు.

నాపై దాడి వెనుక ఉన్నది.. ప్రవీణ్ పగడాలలా నన్ను కూడా చంపాలని...

అస‌లేం జ‌రిగింది?
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో మొండిగెడ్డ పంచాయతీ నీరుతోటపాలెం కాఫీ తోటల సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు అభిన‌య్‌పై దాడి చేశారు. కడపకు చెందిన అభినయ్‌ కొన్ని రోజులుగా జిల్లాలో ఉంటున్నారు. నీరుతోటపాలెంలో సమస్యలపై పాదయాత్ర చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసి కారులో తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అభినయ్‌, ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరిని వాహనం నుంచి దింపి, కాఫీ తోటల సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ అభినయ్‌పై బ్లేడుతో దాడి చేశారు. తల, కాళ్లపై కోసేశారు.

అభినయ్‌తో పాటు ఉన్న ఇద్దరిపై కూడా దాడి చేశారు. వారికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అభినయ్‌ స్పృహ తప్పి పడిపోవడంతో మృతి చెంది ఉంటాడని భావించి, దుండ గులు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అభినయ్‌ను జెర్రెల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారు ఎవరో, ఎందుకు దాడి చేశారో తెలియడం లేదు. కడప నుంచి వచ్చిన అభినయ్‌కి ఇక్కడ ఎవరు శత్రువులున్నారో తెలియడం లేదని స్థానికులు తెలిపారు. అభినయ్‌ కారుపై కూడా దాడి చేయడంతో కారు అద్దం పగిలిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement