‘లింకు’ లేకపోయినా రిజిస్ట్రేషన్లు | Chandrababu new Conspiracy on Gramakantham Land Registration | Sakshi
Sakshi News home page

‘లింకు’ లేకపోయినా రిజిస్ట్రేషన్లు

May 20 2026 5:53 AM | Updated on May 20 2026 6:24 AM

Chandrababu new Conspiracy on Gramakantham Land Registration

గ్రామకంఠంలో ఉన్న ఇళ్లపై చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం 

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇస్తే రిజిస్ట్రేషన్లు చేసేయాలని ఆదేశాలు 

రిజిస్ట్రేషన్‌ జరిగినా ఆ భూమిపై హక్కు మాత్రం రాదంటూ ఉత్తర్వులు 

ఆదాయం పెంచుకోవడానికి, ఓట్లు దండుకోవడానికే ఈ డొల్ల విధానం  

సాక్షి, అమరావతి: గ్రామకంఠం భూముల్లో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లను సులభతరం చేసే పేరుతో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లింకు డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రశీదులు లేకపోయినా కేవలం విక్రయించే వ్యక్తి ఇచ్చే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని మంగళవారం రెవెన్యూ శాఖ జీఓ నంబర్‌ 297 జారీ చేసింది. ఇది భూ మాఫియాకు, కబ్జాదారులకు లైసెన్సులా మారే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఖాళీ గ్రామకంఠం స్థలాల గత చరిత్రను తెలిపే ఎలాంటి పాత లింకు డాక్యుమెంట్లు, చివరకు రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి సరి్టఫికెట్లు గానీ అడగకూడదని ప్రభుత్వం సబ్‌ రిజిస్ట్రార్లను ఈ జీఓలో ఆదేశించింది.

దీనివల్ల గ్రామాల్లో రక్షణ లేని ఖాళీ స్థలాలు, స్థానికంగా నివాసం ఉండని వారి భూములను ఈజీగా దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఆస్తి తమకు వంశపారంపర్యంగా వచ్చిందని, తమ ఆ«దీనంలోనే ఉందని విక్రయించే వ్యక్తి ఒక తెల్లకాగితంపై రాసిచ్చే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఆధారంగా సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్‌ చేసేయాలని ఈ జీఓలో స్పష్టం చేశారు. ఎటువంటి అధికారిక పత్రాలు, ఆధారాలూ సరిచూడకుండా కేవలం అమ్మే వ్యక్తి మాటను నమ్మి రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించింది. మరోవైపు రిజిస్ట్రేషన్‌ అయినంత మాత్రాన సంబంధిత ఆస్తిపై హక్కులు రావని పేర్కొనడం గమనార్హం. యాజమాన్య హక్కుల తప్పుఒప్పులకు డాక్యుమెంట్‌ రాసుకున్న వారే పూర్తి బాధ్యులని తెలిపింది.

ఒకరి స్థలాన్ని మరొకరు దొంగ డిక్లరేషన్‌తో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే  ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండబోదని ఆ జీఓలో తేల్చి చెప్పింది. గ్రామకంఠం భూముల్లో చాలావరకు సరిహద్దులు స్పష్టంగా ఉండవు. రెవెన్యూ రికార్డుల్లోనూ వీటి వివరాలు పూర్తి స్థాయిలో లేవు. ఇప్పుడు ఎవరికి తోచినట్లు వారు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచ్చుకుంటూ పోతే, ఒకే స్థలానికి ఇద్దరు ముగ్గురు యజమానులు తయారవుతారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవడానికి, ఓట్ల రాజకీయం కోసమే రక్షణ లేని డొల్ల  విధానాన్ని సర్కారు తీసుకువచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది సామాన్యుల ఆస్తులకు భద్రత లేకుండా చేయడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.     

Advertisement
 
Advertisement
Advertisement