ప్రైవేట్‌ సంస్థకు బాబు సర్కార్‌ దాసోహం | Chandrababu govt Weakening resources of govt medical sector | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ సంస్థకు బాబు సర్కార్‌ దాసోహం

May 20 2026 5:28 AM | Updated on May 20 2026 5:50 AM

Chandrababu govt Weakening resources of govt medical sector

104 ఎంఎంయూలో వైద్య పరీక్షల పేరిట ఏటా రూ.162 కోట్లు పందేరం

నాలుగేళ్లలో రూ.700 కోట్లు సమర్పించేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

కదులుతున్న వాహనాల్లో రక్త పరీక్షలు సురక్షితం కాదన్న విషయం బేఖాతరు 

దోపిడీయే లక్ష్యంగా ‘మెడాల్‌’ తరహా మరో స్కామ్‌కు తెరతీత 

2014–19 మధ్య వైద్య పరీక్షల పేరిట రూ.300 కోట్ల కుంభకోణం   

ఇప్పుడు దానిని మించి దోచుకునేందుకు నిపుణుల మాట కాదని కట్టబెట్టేసిన వైనం 

వాస్తవానికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన విలేజ్‌ క్లినిక్స్‌లో 14 రకాల వైద్య పరీక్షలు 

ఇంతకు మించి ఎవరికైనా రక్త పరీక్షలు అవసరం అయితే పీహెచ్‌సీల్లో 63 పరీక్షలకు వీలు  

104 గ్రామానికి వెళ్లిన రోజు సీహెచ్‌వోల ద్వారా రక్త నమూనాలు సేకరణ 

పీహెచ్‌సీలో పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడి.. తద్వారా మందుల డోర్‌ డెలివరీకి పకడ్బందీ వ్యవస్థ 

ఇలాంటి అద్భుత వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్‌ సంస్థకు సర్కార్‌ దాసోహం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగంలో ఉన్న వనరులను నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌ సంస్థలకు దాసోహం అవుతోంది. పీపీపీ ప్రాజెక్ట్‌ల పేరిట అస్మదీయులకు రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకు బరితెగిస్తోంది. ఈ పరంపరలో 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్స్‌ (ఎంఎంయూ)లో వైద్య పరీక్షల పేరిట మెడాల్‌ తరహా కుంభకోణానికి తెరలేపుతోందనే విమర్శలు హోరెత్తుతున్నాయి. టీడీపీ డాక్టర్స్‌ సెల్‌లోని ఓ డాక్టర్‌కు చెందిన భవ్య అనే సంస్థకు రూ.3 వేల కోట్ల విలువైన 108 అంబులెన్స్‌లు, 104 ఎంఎంయూ, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ) నిర్వహణ కాంట్రాక్ట్‌ను గతేడాది కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సంస్థకు ఎంఎంయూల ద్వారా రక్త పరీక్షల నిర్వహణ పేరిట ఏటా రూ.162.72 కోట్ల చొప్పున సమర్పించడానికి సోమవారం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. 

ఈ క్రమంలో 2014–19 మధ్య రాష్ట్ర వైద్య శాఖలో చోటు చేసుకున్న మెడాల్‌ స్కామ్‌ను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మెడాల్‌ ద్వారా పీపీపీ విధానంలో రక్త పరీక్షలు చేపట్టి అప్పట్లో రూ.300 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారనే ఆరోపణలున్నాయి. ధిప్పుడు ఎంఎంయూల్లో రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఇదే రీతిలో దోపిడీకి తెర తీయడమేనని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఐదేళ్ల కాంట్రాక్ట్‌ కాల పరిమితితో గతేడాది భవ్య సంస్థ 104, 108 నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. మరో నాలుగేళ్ల పాటు ఆ సంస్థకు కాంట్రాక్ట్‌ పరిమితి ఉంది. ఈ లెక్కన పరిశీలిస్తే నాలుగేళ్లలో ఎంఎంయూల్లో వైద్య పరీక్షల పేరిట రూ.700 కోట్ల మేర నిధులు మళ్లించబోతున్నారు.  

ఒక్కొక్కరికి పరీక్షలకు రూ.288   
రాష్ట్రంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 104 ఎంఎంయూ వాహనాలు కొత్తగా 904 సమకూర్చారు. నాడు–నేడు కింద వైద్య రంగాన్ని బలోపేతం చేశారు. 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రాథమిక వైద్యంతో పాటు, 14 రకాల పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఏడాది పొడవునా బీపీ, షుగర్‌ బాధితులు, గర్భిణులు, వృద్ధులకు ఇక్కడ వైద్య సేవలు అందేవి. నెలలో రెండు పర్యాయాలు 104ల ద్వారా పీహెచ్‌సీ వైద్యులు విలేజ్‌ క్లినిక్‌లు సందర్శించి, రోజంతా గ్రామంలో ఉంటూ వైద్య సేవలు అందించేవారు. ఇందుకోసం అధునాతన ల్యాబ్‌ సౌకర్యంతో పీహెచ్‌సీలను తీర్చిదిద్దారు. మరోవైపు గ్రామాలకు నాలుగు, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్‌సీలను బలోపేతం చేసి  వాటిలోని ల్యాబ్‌లకు అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. 

తద్వారా ప్రతి పీహెచ్‌సీలో 63 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. ఇలా ప్రభుత్వ పరిధిలోనే రోగ నిర్ధారణకు ఎంతో పకడ్భందీ వ్యవస్థ ఉండగా, ఎంఎంయూల్లో వైద్య పరీక్షల పేరిట ప్రస్తుత చంద్రబాబు సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎంఎంయూల్లో వైద్య పరీక్షలు మెడాల్‌ తరహా స్కామ్‌కు దారితీస్తుందని టెండర్ల సమయంలోనే వైద్య శాఖ అధికారులు తటపటాయించినట్టు సమాచారం. ఈ భయంతోనే గతేడాది 104, 108 నిర్వహణ టెండర్‌లోనే వైద్య పరీక్షల కాంట్రాక్ట్‌ను కూడా ఖరారు చేసినప్పటికీ అమలును వాయిదా వేసినట్టు తెలిసింది. ప్రభుత్వ పెద్దలు అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో తాజాగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయిస్తున్నారు. ఫలితంగా ఒక్కో ఎంఎంయూలో ఒక్కొక్కరికి రూ.288 చొప్పున రోజుకు 20 మందికి పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా నెలలో 520 మందికి పరీక్షల కోసం ప్రభుత్వం రూ.1.5 లక్షలు చెల్లించడానికి సిద్ధమైంది. ఇలా ఏడాదికి 904 ఎంఎంయూలకు రూ.162.72 కోట్ల చొప్పున కాంట్రాక్ట్‌ సంస్థకు ముట్టనుంది. 
104 వాహనాల్లో వైద్య పరీక్షలు చేయడానికి అనుమతి ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులు 

ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం  
ప్రభుత్వ రంగంలోనే అందుబాటులో ఉన్న ప్రివెంటివ్‌ కేర్‌ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ బాబు సర్కార్‌ ఇప్పుడు ప్రైవేట్‌ సంస్థకు నిధులు ధారబోయనుంది. ప్రజారోగ్యం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందుబాటులో ఉన్న వ్యవస్థలనే వాడుకోవచ్చని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విలేజ్‌ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత ఉన్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు (సీహెచ్‌వో) ఉన్నారు. వీరికి రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించడంలోనూ అనుభవం ఉంది. ఈ క్రమంలో 104 గ్రామా­నికి వచ్చిన రోజు వైద్యులు సూచించిన రోగుల నుంచి నమూనాలు సేకరించి పీహెచ్‌సీలకు తరలిస్తే ఉచితంగా 63 రకాల పరీక్షలు చేయడానికి వీలుంది. 

వాటి ఫలితాల ఆధారంగా పీహెచ్‌సీలోని వైద్యుడు సీహెచ్‌వోలకు వర్చువల్‌గా అవసరమైన మందులు సూచిస్తే.. సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశాల ద్వారా నేరుగా రోగి ఇంటి వద్దకు డెలివరీ చేయవచ్చు. జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనిక్‌ వంటి స్పెషలిస్ట్‌ కన్సల్టెషన్‌.. అవసరమైతే విలేజ్‌ క్లినిక్‌ నుంచే టెలీమెడిసిన్‌ ద్వారా వర్చువల్‌ కన్సల్టేషన్‌కు కూడా అవకాశం ఉంది. ఒకవేళ మెరుగైన వైద్యం అవసరమైతే గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ద్వారానే ప్రభుత్వాస్పత్రులు/ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేసే ఆస్కారం ఉంది. ఇంత పకడ్బందీ వనరులను కాదని 104లో పరీక్షల పేరిట ఏకంగా రూ.700 కోట్ల మేర ప్రజాధనం ఖర్చు చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపుతోందంటే ఇందులో ‘మాకింత–మీకింత’ వ్యవహారం తప్ప మరోటి కాదని సర్వత్రా చర్చ జరుగుతోంది.   

ప్రతికూలతలను పట్టించుకోని సర్కారు
104 ఎంఎంయూలు నిత్యం పీహెచ్‌సీల నుంచి గ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో కదిలే వాహనాల్లో ల్యాబ్‌ను ఏర్పాటు చేసి నిర్వహించే పరీక్షల్లో కచ్చితత్వంపై వైద్య వర్గాల్లో అనేక అనుమానాలు ఉంటున్నాయి.  
⇒ వాహనం నిరంతరం రోడ్లపై ప్రయాణించడం, గుంతల్లో పడటంతో మిషన్లలో ఉండే సెన్సార్లు, లెన్సులు, గ్లాస్‌ ట్యూబ్‌లు వాటి కచ్చితమైన స్థానాల నుంచి స్వల్పంగా కదలడానికి వీలుంటుంది. దీంతో మిషన్లు తప్పుడు రీడింగ్స్‌ చూపే అవకాశం లేకపోలేదు.    
⇒ స్థిరమైన ల్యాబ్‌లలో సెంట్రలైజ్డ్‌ ఏసీ ద్వారా ల్యాబ్‌కు అవసరమైన ఉష్ణోగ్రతలను నిర్వహించడానికి వీలు ఉంటుంది. కదిలే వాహనాల్లో అది అసాధ్యమని తెలుస్తోంది.   
⇒ రక్త పరీక్షలకు వాడే రసాయనాలు సున్నితంగా ఉంటాయి. వాహనం ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు, ఏసీ ఆగిపోయినప్పుడు ల్యాబ్‌ లోపల వేడి వేగంగా పెరుగుతుంది. అలాంటప్పుడు ఈ రసాయనాల పనితీరు దెబ్బతిని, తప్పుడు ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.    
⇒ రోడ్లపై తిరిగే వాహనాల్లోకి దుమ్ము, ధూళి, పొగ ప్రవేశించే అవకాశం కూడా ఉంటుంది. వాహనంలోకి వచ్చే సూక్ష్మ దుమ్ము కణాలతో రిపోర్టులో తేడా రావచ్చు.   

Advertisement
 
Advertisement
Advertisement