భారత్-ఆస్ట్రేలియా బోర్డర్ గావాస్కర్ టెస్ట్ సిరీస్ ఆసాంతం టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్‌పంత్ హాట్ టాపిక్ అవుతున్నాడు. మైదానంలో ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్‌తో వ్యవహరించిన తీరు.. అనంతరం వారి కుటుంబంతో గడపడం, పైన్ సతీమణి బెస్ట్ బేబీసిట్టర్ అంటూ.. పంత్‌ను కొనియాడటం సోషల్‌మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే చివరి టెస్ట్ ఆడేందుకు సిడ్నీకి వచ్చిన ఇరు జట్ల ఆటగాళ్లకు ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ తన నివాసంలో విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రిషభ్ పంత్ ఆసీస్ ప్రధానికి తారసపడగా.. అక్కడున్న వ్యక్తి ఒకరు పరిచయం చేయబోయ్యారు. మారిసన్ వెంటనే ‘అయ్యో ఇతను నాకెందుకు తెలియదు.. స్లెడ్జ్ చేశావ్ కదా! నీ స్లెడ్జింగ్‌ను నేను స్వాగతిస్తున్నాను. మేం ఇలాంటి రసవత్తర పోరును ఇష్టపడతాం’ అని చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.