ఆర్టీసీ సమ్మె వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అలాంటి కమిటీ ఏదీ అవసరం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రతిపాదించిన విధంగా తాము ఎటువంటి కమిటీని ఏర్పాటు చేయబోమని పేర్కొంది. ఆర్టీసీ సమ్మె వివాదాన్ని పారిశ్రామిక వివాదాల చట్టం కింద లేబర్ కోర్టుకు నివేదించాల్సి ఉందని తెలిపింది. వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని పారిశ్రామిక వివాదాల చట్టంలో ఎక్కడా లేదని నివేదించింది. అందువల్ల పారిశ్రామిక వివాదాల చట్టం కింద ఈ వ్యవహారంలో తాము ముందుకెళ్లే విధంగా ఎటువంటి జాప్యానికి తావు లేకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్‌కే జోషి బుధవారం అఫిడవిట్ దాఖలు చేశారు.