సాక్షి, తిరుపతి: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు.. లంచావతారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. అవినీతి అధికారుల భరతం పట్టమని, పారదర్శకంగా పనులు జరగాలని సీఎం వైఎస్ జగన్‌మోహర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. తిరుపతి అటవీశాఖ డిప్యూటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్( డిఎఫ్‌ఓ) వెంకటా చలపతి నాయుడు నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అన్నారావు కూడలి సమీపంలో మోర్ సూపర్ మార్కెట్ వెనుక వైపు ఉన్న ఎం-2 గ్రాండ్ హోటల్ నాలుగో అంతస్తు ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. తిరుపతితో పాటు ఏకకాలంలో కడప జిల్లా రాయచోటి, చిత్తూరు, బెంగుళూరు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ ఏఎస్పీ ఎం శ్రీనివాస్, డిఎస్పీ అల్లాబక్ష్, ఇన్‌స్పెక్టర్లు గిరిధర్, రవికుమార్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టారు.