సాక్షి, చిత్తూరు : ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో విజృంభిస్తున్న వేళ వుహాన్‌లో చిక్కుకున్న 58 మంది తెలుగు ఇంజనీర్ల పరిస్థితిపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. తమ పిల్లల ఎలా ఉన్నారో అని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్లు క్షేమంగానే ఉన్నట్టు టీసీఎల్ హెచ్‌ఆర్ ఆపరేషన్స్ ప్రతినిధి రఘు తెలిపారు. ఇంజనీర్ల తల్లిదండ్రులు ఆందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు. వుహాన్‌లో చైనా ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు వారిని అక్కడి నుంచి వెంటనే భారత్‌కు తీసుకురాలేకపోతున్నామని చెప్పారు. బీజింగ్‌లోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడామని వీలైనంత త్వరగా వారిని ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు తాము క్షేమంగానే ఉన్నామని.. వదంతులు నమ్మవద్దని చైనాలో చిక్కుకున్న ఇంజనీర్లు కోరారు.